తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. వచ్చిన కార్యకర్తలు, శ్రేణులు, వివిధ వర్గాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు.చెమటతో తడిచిపోతూ కూడా ప్రజా వినతులు తీసుకునేందుకు చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారు.
గత ఐదేళ్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే విజ్ఞాపనలు చూస్తే అర్ధమవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని, వీరందరి ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచీ చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివిధ వర్గాల నుంచీ వచ్చిన అనేక విజ్ఞాపనలు సీఎం స్వీకరించారు.
గత అయిదేళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవటంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.