సోషల్ మీడియా విస్తృతి చెందిన తరువాత వెర్రి వేయి విధాలు లక్ష విధాలుగా వెర్రితలలు వేస్తోంది.. కొడ్డిపాటి లైక్ లా కోసం వ్యూస్ కోసం సోషల్ మీడియా జనం జనాలతో ఆటలు మొదలుపెట్టారు.. తండ్రి కూతుర్ల బంధం పై హేయమైన కామెంట్లు పెట్టిన వాళ్ళని అరెస్టు చేసిన నేపథ్యం లో ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న తరుణం లోనే పై తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో తీవ్ర విమర్శలకు గురైంది.. దీనిని హేయ మైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది.
నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియో ని రూపొందించగా, కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది.
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో, వారి మధ్యనే ఉండి కొంతమంది ఆకతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.