మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా వాటిని బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లను భక్తులకు కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారు ఆర్జిత సేవా టికెట్ల మొత్తాన్ని చెల్లించి స్లాట్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు అదేవిధంగా, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను అదే రోజున అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. తిరుమలలో మే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను ఈ 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణువాసం వంటి వసతి గదులకు సంబంధించిన మే నెల గదుల కోటాను ఈ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు