యుగయుగాల నమ్మకం… కలియుగ వైకుంఠం.. తిరుమల.. ప్రపంచంలో అత్యధిక హిందువులు దర్శించే పుణ్యక్షేత్రం. కనీసం కనురెప్ప వేసే సమయమైన స్వామి ని చూడాలని భక్తులు తహతహ లాడుతూ వుంటారు. అలాంటి ఏడు కొండలపై కొలువైన శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు తిరుమల వివిధ మార్గాల్లో చేరుకుంటారు.. చాలామంది నడకమార్గాన్ని ఎన్నుకుంటారు.. అయితే నడక మార్గం అంటే అందరికీ గుర్తొచ్చేది అలిపిరి నడకమార్గమే.. మహా అయితే మరికొంత మంది శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా వెళ్తుంటారు… కానీ శ్రీవారిని చేరుకోడానికి ఈ సప్తగిరులలో మరిన్నో నడకమార్గాలు ఉన్నాయి.. స్వామి పై అపారమైన భక్తి తో ముప్పై రెండువేల సంకీర్తనలు రచించిన వాగ్గేయ కారుడు అన్నమయ్య అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ సమయం పట్టే మార్గాలలో ఇది ఒకటి. శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం ఎనిమిది మార్గాలు ఉండగా వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే ‘ఆదిపడి’ అనగా మొదటిమెట్టు అని పండితులు చెపుతుంటారు. పదకుండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం వుండే ఈ మార్గాన్నే ఎక్కువమంది ఎంచుకుంటారు. భక్తులు నడిచే విధానం బట్టి సమయం పడుతుంది. ఇక రెండవ దారి తిరుపతి కి పదిహేను కిలోమీటర్ల దూరంలోని శ్రీనివాస మంగాపురానికి అక్కడికి సమీపదూరంలో ఉంది. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు. శ్రీ వారి మెట్టు గా పిలిచే ఈ మార్గంలో ప్రయాణిస్తే శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి ఒక గంట మాత్రమే పడుతుంది.. రద్దీ లేకుండా, ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉండే ఈ దారిని నూరుమెట్ల దారి అని కూడా వ్యవహరిస్తారు. అలా పిలిచినంత మాత్రాన ఈ మార్గంలో ఉండేవి కేవలం నూరు మెట్లె కాదు. సుమారు రెండు వేలా ఐదువందల మెట్లున్నాయి.. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాతే ఈ దారి వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి కి ఎనిమిది కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారట.. కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు కధనం. అలాగే తిరుమల కొండకు ఈశాన్యాన మూడవ దారి ఉంది.. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు. అలాగే తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం … దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతావుంటారు.. డ్యాం నుంచి ఓ మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్ళీ అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం పదిహేను కిలోమీటర్లు.. ఐదవ దారి కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడి నుండి తుంబురుతీర్థం పాపవినాశనం తిరుమల చేరుకోవచ్చు.. దీని ప్రయాణ దూరం పన్నెండు కిలోమీటర్లు.. శ్రీవెంకటేశ్వర స్వామి ని చేరుకోడానికి ఆరవ దారి అవ్వాచారి కొండ లేదా అవ్వాచారికోన దారి ద్వారా వెళ్లే అవకాశం ఉంది. రేణిగుంట సమీపంలో కడప తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు ఇక ప్రపంచ ప్రఖ్యాత తలకోన నుండి కూడా తిరుమలకు నడక దారి ఒకటి ఉంది.. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే .. తిరుమలకు చేరుకోవచ్చు. నడక మార్గం అయితే సుమారు గా ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. అన్ని మార్గాలు చేరేది ఆ శ్రీనివాసుని సన్నిధికే.. అలిపిరి మార్గం, శ్రీనివాసమంగాపురం దగ్గరనున్న శ్రీవారి మెట్టు ఈ రెండు మార్గాల్లో జనసందడి ఎక్కువగానే ఉంటుంది.. మిగిలిన మార్గాల్లో కొంచెం కష్ట సాధ్య ప్రయాణం అవ్వొచ్చు.. అయినా సరే ఈసారి తిరుమలకు వెళ్ళే నడక దారి యాత్రికులు ఈ దారులలో వెళ్ళటానికి ప్రయత్నించండి.ఓం నమో వెంకటేశాయ..
previous post
next post