కలియుగ వైకుంఠం ఇప్పుడు సూర్యుని భగభగలకు నిలయంగా మారిపోయింది.. గతంలో ఎప్పుడు లేనంత వేడిగాలులు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదివారం సూర్యుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించాడు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత తో జనాలు అల్లాడిపోయారు.. ఉత్తర భారతదేశంలో వడగాల్పుల తీవ్రత కారణంగానే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందని అలాగే ఇటీవల వచ్చిన తుపాను కూడా ఈ ఉష్ణోగ్రతలకు కారణమని వాతావరణశాఖ తెలియజేస్తోంది. కొండ దిగువన 41డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ 45డిగ్రీల ప్రభావం కనిపిస్తోందని చెపుతున్నారు. తిరుమలలో పలువురు భక్తులు కాలికి గోనె సంచుకు కట్టుకుని తిరుగుతున్నారు. మాడ వీధుల్లో చెప్పులు ధరించకూడదన్న నియమం ఉండడంతో ఎండ దెబ్బకు మాడ వీధుల్లో నడవలేకపోతున్న భక్తులు గోనె సంచుల్ని కట్టుకుని నడుస్తున్నారు.. మడవీధులను నీటి తో తడుపుతున్నప్పటికి అధిక ఉష్ణోగ్రత కారణంగా వెంటనే నీళ్లు ఆవిరైపోతున్నాయి..కొన్ని చోట్ల కూల్ పెయింట్ వేయలేదని.. వెంటనే అక్కడ కూడా కూల్ పెయింట్ వేస్తే బావుంటుందని కొందరు టీటీడీని కోరుతున్నారు. ఆలయాల ఎదుట చలువపందిళ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు సాధారణ దినాల్లో అరవై వేలకు పైగా వచ్చే భక్తుల సంఖ్య వీకెండ్ లలో ఎనభై వేలకు పైగా ఉంటోంది.