కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని రూపం క్షణమాత్రమైన సరే దర్శిస్తే చాలు అనుకుంటారు భక్తులు.. ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శన భాగ్యం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.. ఒక్కోసారి ఆ శ్రీనివాసుడే భక్తుల దగ్గరకి వెళ్ళి వారిని ఆనంద పరవశుల్ని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అలా వృద్ధాప్యం కారణంగా తన దర్శనానికి రాలేని ఓ భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే అతని కోటకే తరలి వెళ్లి స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి కి అత్యంత సమీపంలోనే ఉంది. సాక్షాత్తు కలియుగ దైవాన్ని మెప్పించిన ఆ భక్తుడెవరు..? భక్తుడి కోసం తరలి వచ్చిన ఆ స్వామి వెలిసింది ఎక్కడ..? అనునిత్యం నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న ఆ క్షేత్రం ఏంటి..? కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడైన తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడు.. ఆ చక్రవర్తి అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొని శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు.రత్నఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు.శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొని తన ఇంటనే కొలువుండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు.తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడై ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం తన ఇద్దరు దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా తొండమానుని కోటలో వెలిశారు. ఆ కాలంలో తొండ మడల ప్రాంతమంతా తమిళ భాష మాట్లాడే ప్రజలు అధికంగా నివసించడం చేత స్వామివారిని “వీటిల్ ఇరందు రాయ్ పెరుమాళ్”గా పిలిచేవారు.. ప్రసన్న వదనుడై అన్ని చోట్లా నిలుచున్న స్థితిలోనే శ్రీవారు దర్శనమిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు ధర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ వుండే తామరగుంట పుష్కరిణి కి తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా మళ్లించి ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. .ఈ క్షేత్రం తిరుమతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో స్వామి కొలువైన ఈ తొండమనాడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు బస్సు అందుబాటులో ఉంటుంది.
previous post
next post