Vaisaakhi – Pakka Infotainment

దోషాలు పోగొట్టే తొమ్మిది తీర్ధాల శ్రీవారి పుష్కరిణి

తిరుమల శ్రీవారి దర్శనం లో అంతటి ప్రాముఖ్యత ఉన్న విశిష్ట ప్రదేశం శ్రీవారి పుష్కరిణి.ఆలయానికి ఉత్తరాన ఉన్న పుష్కరిణి తొమ్మిది తీర్ధాల పవిత్ర ప్రదేశం.. ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.. కలియుగ వైకుంఠమైన తిరుమలకొండ కు వేంచేసిన వేంకటేశ్వరుడు తన జలక్రీడల నిమిత్తమై వైకుంఠం నుంచి స్వయంగా భువి కి తీసుకువచ్చిన తీర్థమిదేనని పండితులు చెపుతుంటారు.. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. సకల పాపనాశనిగా పేరు గాంచిన ఈ పవిత్ర పుష్కరిణి లో స్నానమాచరిస్తే సకల దోషాల నుంచి విముక్తులవుతారని చెప్తుంటారు. తారకాసురుని వధ అనంతరం బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానమాచరించి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు కధనం. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల నమ్మకం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాల ముగింపు ఉంటుంది. నిజానికి ఈ పుష్కరిణి నదిలాంటి ప్రవాహమూ కాదు.. కేవలం అవసరాలకు వాడుకునే నీటి కుంట అంతకంటే కాదు తొమ్మిది తీర్థాలు నిక్షిప్తమైన పుణ్య క్షేత్రం.. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా తొమ్మిది తీర్థాలున్నాయి. అసలు తీర్థాలు ఇక్కడెందుకు ఉన్నాయి.. వాటి వల్ల భక్తులకు కలిగే ప్రయోజనం ఏంటి..? శ్రీవారి పుష్కరిణి అంతర్భాగం లో ఉత్తరాన ఉన్న ధన తీర్థాన్ని కుబేరుడు నిర్మిండం వలన దీనిని కుబేర తీర్థం అని పిలవబడుతుందని పురాణాలు చెప్తున్నాయి.ఇందులో పుణ్యస్నానాలు చేయడం వలన సర్వపాపాలు పోయి ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్థాయని చెప్తుంటారు. ఈశాన్య భాగంలో గాలవ మహర్షిచే నిర్మితమైన గాలవతీర్ధంలోని తీర్థాన్ని త్రాగినా, స్నానమాచరించినా ఇహ, పర సుఖాలు సమకూరుతాయట. అలాగే శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిదే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుందని నమ్మిక. ఆగ్నేయం లో అగ్ని దేవునిచే ఏర్పాటు చేయబడ్డ ఆగ్నేయ తీర్థం ఉంది. ఈ తీర్ధం పాపాల నుంచి విముక్తి ఇస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. దక్షిణ భాగంలో ఉండే యమ తీర్థం వలన మానవునికి నరక బాధ తప్పుతుందంటారు. నైరుతి దిశలో వశిష్ట మహాముని నిర్మిత వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయట. పడమర నున్న వరుణతీర్థం, వాయువ్యం లోని వాయుతీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది. ఈ తొమ్మిది తీర్థాలలో స్నానానంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు అత్యంత ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు. అందువల్ల తొమ్మిది తీర్థాల స్వామి దర్శనం తరువాత ఉన్న శ్రీ వరాహస్వామిని తప్పక దర్శించుకోవాలి.. సకల దోషాలు నివృత్తి చేసే నవ తీర్థాలున్న ఈ పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే అని పురాణాలు చెపుతున్నాయి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More