Vaisaakhi – Pakka Infotainment

గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేయ్యాలి..?

గుడికెళ్ళామంటే దేవుని దర్శనానికి ముందే మూడుసార్లో .. పదకొండు సార్లో ఆ దేవుణ్ణి తలచుకుని ప్రదక్షిణలు చేసేస్తాం.. చాలా మంది గురువులు, పండితులు కూడా మనకేదైన కష్టమో నష్టమో కలిగితే ఫలానా గుడికి వెళ్లి ఇన్ని సార్లు ప్రదక్షిణ చెయ్యండి అని ఒక రెమెడీ కూడా చెప్తారు.. సంప్రదాయమో.. ఆనవాయితీయో అన్నది పక్కన పెడితే అందరూ చేస్తుంటారు.. అలాగే మనమూ చేసేస్తాం.. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి.. దాని వెనుక విశేషమేమైన ఉందా..? ఇంతకీ ప్రదక్షిణ అని దేనిని అంటారు..?అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అని బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు.ఋగ్వేదం లో ప్రదక్షిణ గురించి ఎం చెప్తోంది అంటే ప్రదక్షిణ అంటే.. దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అన్న వివరణ ఇస్తోంది.. ఇక స్కాందపురాణమైతే ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి వివరణ గా చెబుతోంది..’ప్ర’ అంటే పాపాన్ని నివృత్తి చేయడం అని’ద’ అంటే కోర్కెలను ఇచ్చేదని..’క్షి’ అంటే కర్మను క్షయం చేసేది అని.. ‘ణ’ అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది..శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు వుండే అంతరార్థం ఏంటంటేమొదటి అచ్యుత ప్రదక్షిణ మానసిక పాపాలను, రెండవ ప్రదక్షిణ వాచిక పాపాలుమూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు నివృత్తి అవుతాయని చెపుతుంటారు. దేవాలయం లోకి ప్రవేశించినవారు ఎన్నో మానసిక భారాలతో వస్తారు గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని వేదవాంగ్మయం చెబుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మది గా అంటే ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా నడవమని నియమం శాస్త్రాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రదక్షిణ లో కుడి నుంచి ఎడమవైపుగా దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం.ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది. కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.ఆది శంకరాచార్యులు చెప్పినట్టు ‘1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి’ అని అంటారు.. ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది . మరికొందరు108 ప్రదక్షిణలు ఎంతో విశిష్టమని చెప్తుంటారు.. కొన్ని దేవాలయాలు గిరి ప్రాముఖ్యత ని కలిగి ఉంటాయి.. అలాంటి విశిష్ట ఆలయాలు శిఖర సమేతంగా ఉంటాయి.. వాటిలో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఒకటి.. పౌర్ణమి పర్వదినాల్లో వేలాది మంది ఈ గిరి ప్రదక్షిణ లో పాల్గొంటారు.. అలాగే ఆంద్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం లో వార్షిక గిరి ప్రదక్షిణ కూడా పుణ్యదాయకం.. అయితే ఇటీవల చాలా దేవాలయాల్లో కోరిన కోర్కెలు తీరడానికి ఈ ప్రదక్షిణలను చాలా పాపులర్ చేశారు.. దేవాలయం యంత్ర ప్రతిష్టితమైన ఒక పాజిటివ్ కేంద్రం కనుక ప్రదక్షిణ తో ఎనర్జీ అంతా మనకందుతుంది.. ప్రాముఖ్యత, విశిష్టత ఏదైనా ప్రదక్షిణ ఆరోగ్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని కచ్చితంగా ఇస్తుంది. రావిచెట్టు చుట్టూ చేసే ప్రదక్షిణ మన శరీరాన్ని శుద్ది చేస్తుంది.. పరమార్థం ఏమైనా ప్రదక్షిణ నూటికి నూరుశాతం అత్యంత శ్రేయస్కరం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More