ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. బలమైన అభ్యర్థులను కూడా బరిలోకి దించలేదు. ప్రచారంపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరించాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల మాత్రం బలి పశువులు గా మారారన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. ఓటింగ్ సమయంలోను, కౌంటింగ్ సమయంలోనూ అభ్యర్థులకు అసలు విషయం తెలిసి వచ్చి లబోదిబోమంటున్నారు. ఇక చేసేదేమీ లేక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారుగా ఈ ఎన్నికల్లో కూడా వైసిపి బాగానే ప్రభావం చూపించిందన్న వాస్తవాన్ని గ్రహించారు. జనరల్ ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తుంది. పోటీలో ఉన్న మిగతా పార్టీల కంటే వైసిపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామస్థాయి నుంచి పగడ్బందిగా నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన కూడా వచ్చింది. గెలిచే అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దించింది. ఇక మిగతా పార్టీల విషయానికొస్తే ఏదో మొక్కుబడిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో అభ్యర్థులను పోటీలో నిలబెట్టి అడపా దడపా కొన్నిచోట్ల మాత్రమే ప్రచారాలు నిర్వహించారు. అంతే ఆ తర్వాత మీ చావు మీరు చావండని గాలికి వదిలేసారు. దీంతో వైసిపి అభ్యర్థుల కంటే మిగతా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో బాగా వెనుకబడిపోవడం ఒక ఎత్తైతే చాలామందికి కనీసం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది కూడా తెలియకపోవడం విశేషం. ముఖ్యంగా టిడిపికి సంబంధించిన అభ్యర్థులు తాము అనవసరంగా పోటీలో నిలుచున్నామన్న ఆవేదన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించి రెండు మూడు సార్లు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఆ పార్టీ పట్టించుకోలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విశాఖకు సంబంధించి టిడిపి అభ్యర్థి చిరంజీవి పరిస్థితిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనాల్సిందే ఓటింగ్ సమయంలో కూడా టిడిపి నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. అభ్యర్థి చిరంజీవికి సంబంధించిన కొంతమంది మనసులు మాత్రం మోస్తరుగా కనిపించారు. విశాఖ స్వర్ణ భారతి స్టేడియంలో కౌంటింగ్ సందర్భంగా అక్కడికి వచ్చిన అతనికి పరాభవం కూడా ఎదురయింది. నాయకుడు కాదు కదా ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట లేకపోవడం అతన్ని ఏ మేరకు ఆ పార్టీ చారులో కరివేపాకుల వాడుకుంది అనేది స్పష్టమవుతుంది. టిడిపి పార్టీ ఇలా వ్యవహరించడంపై కూడా ఆ పార్టీలోనే కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబట్టి మరి ఎంపిక చేసిన అభ్యర్థికి పార్టీ పరంగా పూర్తిగా సహకరించకుండా అలా గాలికి వదిలేయడం పై కూడా మండిపడుతున్నారు. స్థానిక నాయకత్వ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. అదే వైసిపి అభ్యర్థి కోసం ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం నుంచి పార్టీ అధిష్టానం వరకు ఏ మేరకు పని చేసింది అనేది అందరికీ తెలిసిందే. టిడిపి అభ్యర్థి కోసం ఆ పార్టీ నేతలు సరిగా ప్రచారం చేయకపోవడం, వారిలో వారికే మనస్పర్ధలు రావడం, అభిప్రాయ భేదాలు పొడచూపడం దీనికి తోడు అభ్యర్థి ఎంపికపై కూడా కొందరు నేతలు అసంతృప్తిగా ఉండటం ఆ పార్టీకి మైనస్ గా మారిందనేది చెప్పవచ్చు. చాలా సర్వేలు మాత్రం వైసిపి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. ఆ పార్టీ విజయం తర్వాత సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిని మాత్రం ఆ పార్టీ బలి పశువు చేసిందని ఆ పార్టీ నేతలు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.