ఐదు నెలల గర్భవతి అనుమానాస్పద మృతి వెనుక మిస్టరీ ని విశాఖ పోలీసులు ఛేదించారు.. మృతురాలి పేరు పై ఉన్న 90 సెంట్ల భూమి పై కన్నేసిన భర్త అతని కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక శ్వేత ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమీషనర్ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. శ్వేతను అత్తమామలు, భర్త, బావ వేధించారన్నారు. శ్వేత తల్లి రమాదేవితో తాను మాట్లాడినట్లు సీపీ తెలిపారు. ఉద్యోగం రీత్యా హైదరాబాద్ కి వెళ్లిన భర్తతో మాట్లాడిన అనంతరం సూసైడ్ నోట్ రాసి గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గర్భం దాల్చిన తర్వాత పుట్టింట్లో కూడా ఆమె తల్లి ఎదుటే గొడవ జరిగి భర్త మణికంఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అప్పుడే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా శ్వేత తల్లి కాపాడింది. శ్వేత ఆడపడుచులిద్దరూ కూడా ఇంటికి వచ్చి శ్వేతను వేధిస్తుండేవారని చెప్పారు.. అలాగే శ్వేత పేరిట ఉన్న 90 సెంట్ల భూమి తన పేరు మీదకి మార్చాలని మణికంఠ శ్వేతను ఇబ్బంది పెడుతూనే ఉన్నారనిఅన్నారు. శ్వేత ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని పోస్ట్ మార్టం మొత్తం వీడియో తీయించినట్టు కమీషనర్ తెలిపారు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అత్తింటివారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నందున ఆమె కన్నవారే అంతిమసంస్కరణలు నిర్వహించారు. కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్వేత భర్త, అత్తామామ, ఆడపడుచు, ఆమె భర్త కూడా ఉన్నారు