Vaisaakhi – Pakka Infotainment

అవసరం లేకపోతే బయటకు రావద్దన్న ఐ ఎం డి

భారత్‌లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4 నాటికి అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికే కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి. ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం గత నెలలో ప్రకటించింది. అయితే.. భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లనే కురుస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి ఇవి ప్రధాన ఆధారం. సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది. వాయువ్య భారత్‌ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతల తీవ్రతను గరిష్ఠానికి చేర్చాయి. ఈ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐ ఎం డి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కోస్తాంధ్రలోని ఉభయగోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణగాలుల ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More