Vaisaakhi – Pakka Infotainment

సర్వ పాపహారణం సాలగ్రామం..

చాలా మంది పూజా మందిరాలలో.., కొన్ని ఆలయాల్లో మనకి సాలగ్రామాలు దర్శనమిస్తుంటాయి.. లింగాకారం లో నలుపు తెలుపు మరి కొన్ని కాషాయ వర్ణం తో దర్శనమిచ్చే ఈ సాలగ్రామాల విశిష్టత ఏంటి..? ఇవి ఎందుకు పూజార్హం..? ‘సాలగ్రామం’ సాక్షత్ విష్ణుస్వరూపం. దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని స్వీకరిస్తే సర్వపాపాలు నశించి, సకల సంపదలు, సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని పండితుల మాట. విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనే రాయి రుపాన్ని ధరించడం వెనుక ఎన్నో కధలు ప్రచారం లో ఉన్నాయి.. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. కానీ జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్య భంగం తోనే జలంధరుని అంతం జరుగుతుందని తెలిపిన తరువాత విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందట.. గండకీనదిలో లభించే సాలగ్రామ శిలలు ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని అంటారు. సాలగ్రమంపై ఉన్న చక్రాల ఆకృతులను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఒక చక్రం ఉంటే సుదర్శనమని, రెండు ఉంటే లక్ష్మీనారాయణ అని,మూడు అయితే అచ్యుతుడనీ నాలుగు ఉంటే జనార్ధుడు అనీ, ఐదు చక్రాలు కలిగితే వాసుదేవుడనీ, ఆరైతే ప్రద్యుమ్నుడనీ, ఏడు చక్రాలు సంకర్షణుడు అనీ, ఎనిమిది చక్రాలు కలిగి ఉంటే పురుషోత్తముడు అనీ తొమ్మిది చక్రలు ఉంటే నవవ్యూహమని దశ చక్రాలు ఉంటే దశావతారమనీ, పదకొండు కి అనిరుద్ధుడు అని, పన్నెండు ఉంటే ద్వాదశాత్ముడు అనీ, పన్నెండు చక్రాల కంటే ఎక్కువ ఉంటే అనంతమూర్తి అని వ్యవహరిస్తుంటారు.. సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి, రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానం చేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన, దానాల కంటే నూరురెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. సాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చెస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుందని ప్రతీతి. సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసి సర్వకష్టాలనుంచి సాలగ్రామం బయట పడవేస్తుందని భక్తుల నమ్మకం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More