ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ విధానాలను.. ఎప్పుడు సమర్థించే శారదాపీఠం స్వామీజీకి అధికారులు ఆగ్రహం తెప్పించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహ స్వామి నిజరూప సందర్శనకు వచ్చిన ఆయన ఉత్సవ ఏర్పాట్లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇంత వరస్ట్ గా ఎప్పుడు చందనోత్సవం జరగలేదని పేదల దేవుడిని ధనవంతులు దేవుడుగా మార్చేసారని.. విఐపి టికెట్లు పోలీసులు ద్వారా అమ్మించారని గర్భాలయం చూస్తే భయం వేసిందని.. ఇలా ఒకటి రెండు కాదు.. స్వామి దర్శనానంతరం చాలా అంశాలపై గట్టిగానే ఆరోపణలు చేశారు. పీఠాధిపతులు దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు ఏది ఎలా ఉన్నా స్వామి వైభవాన్ని.. ఆలయ విశిష్టత గురించి మాత్రమే చెప్పి వెళ్తారు. లేకపోతే మౌనంగా దర్శనం చేసుకుని ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతారు కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఒక పీఠాధిపతి సామాన్య భక్తుడిలా గగ్గోలు పెట్టారు. సింహాచల చరిత్రలో ఏదో దుర్మార్గమైన రోజని ప్రభుత్వానికి అన్నివేళలా అనుకూలంగా ఉండే స్వామీజీ అన్నారంటే ఆలయ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పొద్దు పొద్దున్నే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆలయ ఏర్పాట్లపై ట్వీట్ చేశారు. దాన్ని పరోక్షంగా సమర్థించే రీతిలో అధికారులు పోలీసుల తప్పులపై స్వామీజీ మండిపడటం తీవ్ర చర్చనీయాంశం అయింది. రాష్ట్రం లోనే ప్రముఖ దేవాలయంలో జరిగే విశిష్ట ఉత్సవానికి చేసిన ఏర్పాట్లపై అందరూ పెదవి విరుస్తున్న నేపథ్యంలో స్వామీజీ వ్యాఖ్యలు ఆ తీవ్రతను రెట్టింపు చేశాయి. గత కొంతకాలంగా ఇన్చార్జి ఈవో తోనే కాలం వెళ్లదీస్తున్నారని ఇంత పెద్ద ప్రముఖ ఆలయానికి ఈవో లేకపోవడం దుర్మార్గమని ఆరోపణలు చేయగా కొండపై మీడియా తో మాట్లాడినప్పుడు కొన్ని చానల్స్ కు ప్రైవేట్ గా ఇంటర్వ్యూ లు ఇచ్చినప్పుడు తీవ్ర స్వరాన్ని వినిపించిన స్వామీజీ తరువాత విడుదల చేసిన ప్రెస్ నోట్ లో దర్శనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పడం గమనార్హం గత అనుభవాలు ఉన్నప్పటికీ ఎంత మంది భక్తులు వస్తారు వారికి చెయ్యాల్సిన ఏర్పాట్లపై సరైన అవగాహన లేకుండా ముందుకు వెళ్లడం సర్వత్ర ఆగ్రహం తెప్పిస్తుంది. అంతరాలయ దర్శనాలను నిలిపివేసిన అధికారులు ఈ చందనోత్సవ సమయం ఎంత తొందరగా ముగుస్తుందా అని ఎదురు చూడటం ఒక విశేషం అయితే మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని కితాబునివ్వడం కొసమెరుపు.