స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో వచ్చిన ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు, చారిత్రాత్మక హ్యాట్రిక్ ని అందించడం కోసం ఈ అద్భుతమైన కలయికలో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. విజయదశమి శుభ సందర్భంగా, భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేశారు నిర్మాతలు. “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే సంచలన కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. వైవిధ్యమైన కథలు, పాత్రల ఎంపికతో అనతికాలంలోనే తనదైన కల్ట్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు సిద్ధూ. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం కోసం ప్రతిభగల దర్శకుడు రవికాంత్ పేరెపుతో చేతులు కలిపారు. ‘క్షణం’ వంటి థ్రిల్లర్‌ను సిద్ధు జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. ఇప్పుడు, సిద్ధూ-రవికాంత్ కలిసి సరికొత్త కథాంశంతో సోషియో-ఫాంటసీ డ్రామాతో వస్తున్నారు. భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాల్లోకి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుంది. కోహినూర్ ను తిరిగి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కథాంశమే కాదు, కథాకథనాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నాయి. న్యాయంగా మనకు చెందాల్సిన వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికి, చరిత్ర సృష్టించడానికి మన స్టార్ బాయ్ సిద్ధంగా ఉన్నాడు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టంనుందని, ఈ చిత్రంతో మరో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని నిర్మాతలు చేప్తున్నారు. ఈ సినిమాని అత్యంత భారీస్థాయిలో, ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
previous post