శకుని లేకపోతే భారత యుద్ధమే లేదు.. స్వపక్షం లో విపక్షంలా వ్యవహరించి దుర్యోధనుడ్ని కురుక్షేత్ర సంగ్రామానికి పురిగొల్పిన గొప్ప వ్యూహకర్త. స్వయంగా కౌరవులకు మేనమామ అయినప్పటికి పరోక్షంగా వాళ్ళ ఓటమిని కాంక్షించిన రాజకీయ చతురుడు. అలాంటి శకుని గొప్ప శివభక్తుడు. ఇప్పుడు అప్గానిస్థాన్ గా పిలువబడుతున్న అప్పటి కాలం నాటి గాంధారదేశ చక్రవర్తి సుబలనుని పుత్రుడు. కురు పితామహుడైన భీష్ముని పై ఉన్న వైరం పగ గా మార్చుకుని కౌరవులతో బంధం ఏర్పరుచుకుని కురువంశ సమూలనాశనానికి కారకుడై కురుక్షేత్ర సంగ్రామంలోనే సహదేవుని చేతిలో హతమైన యోధుడు శకుని. శ్రీకృష్ణుని లీలలలో శకుని పాత్ర కూడా ఒక భాగం. జూద కారణంగా దుర్మార్గుల వినాశనానికి దోహదపడింది శకుని అయితే అది చేయించిన సూత్రధారి కృష్ణుడే. కురుక్షేత్ర సంగ్రామానికి కీలకపాత్రధారి అయిన శకుని మామకు కేరళ రాష్ట్రంలో ఒక ఆలయం ఉంది అక్కడ ఆయన దేవుడు గా పూజించబడు తున్నాడు. పవిత్రేశ్వరం’ అనేపేరుతో పిలువబడుతున్న ‘పగుత్తీశ్వరమ్’ ఊరి సరిహద్దులలో… ‘మాయంగోడుమాలన్ సరవుమలనడా’ అనే ఆలయం ఉంది. కేరళ రాష్ట్రంలోని ..కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో ఈ విశేష ఆలయం ఉంది. ఇక్కడి ప్రధానదైవం మాత్రం పరమశివుడు కాగా ఉపాలయం గా శకుని దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం తిరువనంతపురం నుండి 64 కి.మీ దూరం, కొల్లం నుండి 42 కి.మీ దూరం. కొట్టారక్కరా నుండి 13 కి.మీ ప్రయాణం దూరం లో వుంది. పాండల అజ్ఞాతవాస లో కౌరవులు వారికోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని ఆశించారు. అందుకోసం ఈనాటి కేరళ ప్రాంతంలో ఒక చోట అనేక ఆయుధాలు రహస్యంగా దాచివుంచారు. ఆ ప్రాంతమే ‘పగుత్తీశ్వరమ్.’ ‘భీష్ముని పై ప్రతీకారం కోసం తను చేసిన పాపాలకు ఆవేదనచెందిన శకుని, ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుని ప్రార్ధించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్ధలపురాణం వివరిస్తున్నది.ఈ ఆలయ ఆవరణలో భువనేశ్వరిదేవి నాగరాజు ఉపదేవతలుగా పూజలందుకుంటున్నారు. ఆలయం ప్రహారీగోడలతో నిర్మించబడినప్పటికి పై కప్పు గాని, తలుపులు గాని లేవు. భక్తులు అన్ని వేళలా వచ్చి దర్శనం చేసుకొనవచ్చును. మూలవిగ్రహం శకుని విగ్రహం సమీపమున ఒక గద కూడా వున్నది. ఆ విగ్రహానికి ఎదురుగా వున్న ఒక వేదిక పై భక్తులు తాము తెచ్చి పూజా సామగ్రులు , ప్రసాదాలు అమరుస్తారు. అమ్మవారికి సమర్పించినట్టుగా కానుకలు మొక్కులు తీర్చుకుంటారు.. పొంగల్ తో పాటుగా పువ్వులు, పళ్ళు, మద్యం, కల్లు, పట్టు, వక్కలు లాంటి కాయలు, లేత కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తారు. శనీశ్వరుని కి ఇష్టమైనట్టే నల్ల వస్త్రాలు ధరిస్తారు.ఈ ఆలయానికి దిగువ భాగాన అక్కడ నివసించే కొండ జాతుల వారి కులదైవ ఆలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. పరిస్థితుల ప్రాబల్యంతోనే శకుని తప్పులు చేశాడనినమ్ముతున్న కొన్ని తెగల ప్రజలకు ఆయన ఆరాధ్య దైవం. ఈనాటికి ఇక్కడ వుండే దొమ్మరి జాతి వారు శకుని తమను కాపాడే దైవంగా నమ్మి పూజలు ఉత్సవాలు జరుపుతారు. పగవారి వలన తమకు ఎటువంటి బాధలు కలుగకూడదని శకునిని వేడుకుంటారు. ఈ ఆలయ నిర్వహణా బాధ్యతను ఆదివాసుల, దేశదిమ్మరుల కుటుంబాలవారే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే మాసాలలో కోలాహలంగా పెద్ద ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో జనాలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే శకునికి అత్యంత ఇష్టుడైన మేనల్లుడు దుర్యోధనుడి ఆలయం కూడా ఉంది.