Vaisaakhi – Pakka Infotainment

రాకెట్ ప్రయోగాలకు అనుకూల కోట.. శ్రీహరి కోట

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని విధాల రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశ విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెళ్తూ ఉంటాయి. సూళ్లూరుపేటలోని శ్రీహరికోట ను రాకెట్ ప్రయోగాలకు ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే వావ్ అనాల్సిందే రాకెట్‌ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత బలంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత బలంగా ఉంటుంది. రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది ‘రాకెట్‌ ప్రయోగాల కోట’ అయింది. శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్‌ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు వేగం అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్‌ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు. భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం పెరుగుతుంది. భూ భ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. రాకెట్‌ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి.వీటిలో కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలనే, రాకెట్‌ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోటకు సమీపంలోనే రైలు, రోడ్డు,విమాన, నౌకా మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి అతి సమీపంలో ఉంది. ఇరవై కిలోమీటర్లలో రైల్వే స్టేషన్‌, 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై పోర్టు ఉన్నాయి. అలాగే రాకెట్‌ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే. రాకెట్‌ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. ఆ రాకెట్‌ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది.కానీ, శ్రీహరి కోట చుట్టూ బంగాళాఖాతం, పులికాట్‌ సరస్సు ఉంటాయి. ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారం గానీ, ఇళ్లు కానీ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా రాకెట్‌ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు. ఇలాంటి పరిస్ధితులే శ్రీహరికోటను అంతర్జాతీయ రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాయనడం లో ఎటువంటి సందేహం లేదు.

L

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More