అప్పుడెప్పుడో కొన్నాళ్ళు మనుగడ లో ఉండి నిర్వహణ వ్యయాలను భరించలేక, ఎమ్ ఎస్ ఓ (MSO) ల ప్రాధాన్యత లిస్ట్ లో చోటు సంపాదించుకోలేక అర్ధాంతరంగా అదృశ్యమైపోయిన ఆర్ టీవీ (RTV) మళ్ళీ ఎయిర్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.. ఈసారి రాయుడు టీవీ లా కాకుండా రవిప్రకాష్ టీవీ లా దర్జాగా, ఠీవిగా, రాబోతున్నట్టు తెలుస్తోంది.. మొన్నటికి మొన్న టీవీ9 ఛానెల్ లో కనపడి మీడియా మేధావుల మస్తిష్కాలలో ఒక్కసారిగా కల్లోలం రేపిన రవిప్రకాష్ కొత్త ఛానల్ కోసం రంగం సిద్ధం చేసినట్లు ఆన్ ది రికార్డ్ న్యూసే. చాన్నాళ్ల నుంచి మీడియా లో మ్యూట్ అయిపోయిన రవిప్రకాష్ టీవీ9 లో కనపడేసరికి మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీ9 లోకి పునరాగమం అని కొందరంటే వాటాదారుగా ఏ బీ సి లో ఆడిటింగ్ కోసమే ఇక్కడికొచ్చానని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.ఇప్పుడు తాజాగా రవిప్రకాష్ సొంత చానెల్ ప్రచారం మళ్ళీ తెరమీదకొచ్చింది… ఆర్ టీవీ పేరిట ఓక లోగో దానితో పాటు సిబ్బంది, నియామకాలు అంటూ హడావుడి.. అన్నీ మొదలైనట్టే కనిపిస్తున్నాయి ఎవరు ఎం అనుకున్నా నిజానికి తెలుగు టీవీ జర్నలిజానికి కొత్త పాఠాలు నేర్పించి పాత్రికేయులకు సెలెబ్రిటీ హోదా ను కట్టపెట్టిన ఘనత మాత్రం రవిప్రకాష్ దే. ప్రకాష్ అన్న టాగ్ తగిలించుకుని ఒక వెలుగు వెలిగిన రవిబాబు అనే ఒక సీనియర్ పాత్రికేయుడు అప్పటి వరకు తన భుజస్కంధాలపై మోసిన ఛానల్ నుంచి బయటకు వచ్చి సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. సొంత చానెల్ పెట్టడానికో.., మరో ఛానల్ ని తన ట్రేడ్ మార్క్ తో లేపడానికో ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. మనీ లాండరింగ్ కేసులు, ఇతరత్రా ఇబ్బందులు ఒక్క రవిప్రకాష్ నే టార్గెట్ చేసి ఆపేసాయా.. కొన్నింటికి సమాధానాలు వేతక్కూడదంతే.. ఇక అసలు పాయింట్ కి వస్తే కొంత కాలం నుంచి బ్రాడ్ కాస్టింగ్ లైసెన్సులు ఆపేసిన తరుణంలో 6టీవీ కన్నడ లైసెన్స్ ను వాడుకుని రవిప్రకాష్ ఆధ్వర్యంలో లో ఛానల్ రాబోతోందని ప్రచారం జరిగింది. ఇప్పుడు రాయుడు టీవీ లైసెన్సు కొనుక్కుని కొత్త హంగులతో కొంత మంది సీనియర్ పాత్రికేయుల వెన్నుదన్నుతో యువ పాత్రికేయులను తెరముందు పెట్టి వ్యవస్థ ను నడిపే యోచనలో రవిప్రకాష్ ఉన్నట్టు విశ్లేషకుల అంచనా. ఇందుకు సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర ఆఫీస్ కూడా ప్రారంభమయ్యిందట కార్యాలయం అయితే ప్రారంభం అయింది.. జనాలు వస్తూ పోతూ వున్నారు. ఛానల్ లో ఉన్న ఓ ట్విస్ట్ ఏంటంటే మొదట డిజిటల్ టీవీ గా వచ్చి … తరువాత శాటిలైట్ గా రూపాంతరం చెందుతుందని సమాచారం. ఇప్పటికే తొలివెలుగు పేరిట ఓ వెబ్‌సైటు, యూట్యూబ్ చానెల్, ఈపేపర్ నడుస్తున్నాయి… హిందీ , కన్నడ , తమిళ , తెలుగు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఆర్ టీవీ స్టార్ట్ చేయాలన్నది ఆ మాజీ సీఈఓ ఆలోచన. లైసెన్స్ ని పూర్తిగా కొనుకున్నారా..? లేక రాయుడు టీవీ అసలు ఓనర్స్ కూడా ఇందులో భాగస్వామ్యులా.. వెనకుండేదెవరు ముందుకొచ్చేదెవరు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ లో కొద్ధో గొప్పో ఆశ నమ్మకం పెట్టుకున్న ఒక జాతీయ పార్టీ కి కొమ్ము కాయడానికే ఆ టీవీ అన్నది నిజమేనా..? ఇలాంటి ప్రశ్నలన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.
previous post
next post