పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మరోసారి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల టూర్ లో బిజెపి నేతలతో పవన్ ఏ విషయమై చర్చించారనే దాని పై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో సంస్థాగతంగా ఎదగడం, మరింతగా బలోపేతం కావడం పైన మాత్రమే రెండు పార్టీలు దృష్టి సారించాయని , అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని రెండు రోజుల టూర్ అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ మీడియాతో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆకస్మాత్తుగా, ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ను ఆగ మేఘాలపై ఢిల్లీకి రప్పించి, వరుసగా బేటీలు నిర్వహించింది దీని కోసమేనా అంటే కాదేమో అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ చుట్టి వచ్చారు అయితే జగన్ ఢిల్లీకి వెళ్లి పది రోజులు గడవక ముందే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరతీసింది. వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తున్నప్పటికీ పార్టీపరంగా నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు రావడంతో ఒక విధమైన అభద్రత భావం ఆవహించిందనే చెప్పాలి. దానికి తోడు టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా జోరందుకోవడంతో వైసీపీ లో మరింత గుబులు మొదలయిందనే చెప్పవచ్చు. జనసేన బీజేపీ లో కొంత మంది బలపడుతున్న టిడిపి- జనసేన మైత్రిని విడదీసేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. టిడిపి కే మన అవసరం ఉంది.పవన్ కళ్యాణ్ సీఎంఅభ్యర్థిగా ప్రకటిస్తేనే పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. ఇదంతా జనసేన, బిజెపి ఆడుతున్న మైండ్ గేమ్ అనే విషయం ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. వైసిపి పై దాడి పెంచిన జనసేనాని ని కంట్రోల్ చెయ్యడానికి బీజేపీ తో కలసి ప్రణాళిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది.ఇందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కూడా బిజెపి నేతలు ముందుంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.సేనాని రెండు రోజుల టూర్ లో ప్రధాని, అమిత్ షా లతో భేటీ ఉంటుందని అందరూ భావించిన్నప్పటికి అలా జరగలేదు. మురళీధరన్‌తోను కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌తో భేటీ అయిన పవన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు సమాచారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ దాదాపు 45 నిమిషాల సాగింది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై, వైసీపీ పాలన, ప్రతిపక్షాలపై దాడులతో పాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నడ్డాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సేనాని ఏజ్ టీజ్గా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ అజెండా అని మరోసారి కుండబద్దలు కొట్టారు ఆ దిశగానే తాము చర్చలు జరిపామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత్వం సాధించాలనే తాము సంకల్పించినట్టు వివరించారు.తమ చర్చలు పొత్తులపై మాట్లాడేంత ముందుకు వెళ్లలేదని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ బట్టి చూస్తే పూర్తిగా బిజెపి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా అక్కడ జరిగింది వేరు. బయటికి వచ్చింది వేరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ టిడిపి దూతగా అక్కడికి వెళ్లారని, వచ్చే ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి వెళితే మంచిదనే అభిప్రాయాన్ని తెలియజేస్తే బిజెపి పెద్దలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వేరే చర్చ పెట్టి దాటవేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మరో కోణంలో వచ్చే ఎన్నికలలో బిజెపి- జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామనే హామీని బిజెపి పెద్దలు ఇచ్చారని మరో గుసగుస కూడా చక్కర్లు కొడుతోంది. బీజేపీ -జనసేన కలసి పోటీ చేస్తేనే పవన్ కళ్యాణ్ ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తామని కేంద్ర బీజేపీ పెద్దలు తెలియజేసినట్లు బోగట్టా. అందుకే ఇటువంటి విషయాలు బయటకి ఎక్కడ పోక్కనవ్వకుండా వ్యతిరేక ఓటు, అలాగే పార్టీలు బలోపేతం అనే అంశాలను ఇరు పార్టీలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడకి వెళ్లిన, ఎవరిని అడిగినా బిజెపి- జనసేన పొత్తుతో ఎవరికి లాభం అంటే కచ్చితంగా అదే వైసీపీకే అని చెబుతారు. అప్పుడు వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పి ఆ రెండు పార్టీలు పోటీ చేయడం ఏంటన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా ఉండగా మరొకవైపు బీజేపీ-జనసేన కలిసే ఉన్నాయని బిజెపి నేత సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రెండు పార్టీల లక్ష్యం ఒక్కటేనని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని వెల్లడించారు. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని, గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీ పెద్దలను కలిసి పవన్ మాట్లాడారంటే తమ రెండు పార్టీల మధ్య బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని సోము వీర్రాజు సూచిస్తున్నారు. బీజేపీ – జనసేన పొత్తు పైన ఎవరికీ అనుమానాలు అక్కర్లేదన్నారు. రాజకీయాల్లో కవ్యూహాల మేరకే అన్నీ జరుగుతాయని చెప్పుకొచ్చారు.
previous post