అపరిచితులకు కిరాయికి ఇచ్చినా, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా వివరాలను సరిచూసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలు మెట్రో నగరాల్లో సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇటీవల బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, జనం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఆ చిరునామా తో డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలను తెరుస్తున్నారు. వాటికి ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయరు. ఇటీవల రుణ యాప్‌లతో రూ.30 వేల కోట్లు కొల్లగొట్టిన చైనీయులు. దిల్లీలో 29 కంపెనీలు ప్రారంభిస్తే అందులో 12 కంపెనీలు ఒకే చిరునామాపై ఉన్నాయి. మెయిల్ హ్యాకింగ్ ద్వారా మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల చిరునామాలన్నీ ముంబయి, చెన్నై, బెంగళూరులోని అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. దిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉంటున్న సైబర్ నేరస్థుడిని పట్టుకుంటే మాదాపూర్, బేగంపేటలలో కార్యాలయాలున్నాయని తేలింది. ఇల్లు, ఫ్లాట్ కిరాయికి ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, బ్యాంక్ ఖాతా నకలు ప్రతులు తీసుకోవాలని పోలీసులు తెలియజేస్తున్నారు. మోసం చేసేవారు కచ్చితంగా నకిలీవి తయారు చేస్తారని, అంతర్జాలంలో వాటిని సరిపోల్చుకున్నాకే ఫ్లాట్, ఇల్లు అద్దెకు ఇవ్వాలని చెబుతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్, బ్రాడ్‌బ్యాండ్ సామర్థ్యం, వినియోగ సమయం తెలుసుకోవాలని, 24 గంటలు ఇంటర్నెట్ వాడుతున్నా, పనిచేస్తున్నట్లు కనిపించినా ఏం చేస్తున్నారని ప్రశ్నించాలని అంటున్నారు. సైబర్ నేరస్థులు ఇల్లు, ఫాట్లలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశాలున్నాయని,అల్పాహారం, భోజనాన్ని ఆన్‌లైన్ డెలివరీ ద్వారా తెప్పించుకుంటారని చెబుతున్నారు. ఇలాంటి అంశాలను గమనించి పనిచేస్తున్న కంపెనీ, పనివేళల వివరాలు తెలుసుకోవాలని, యజమాని మరోచోట ఉన్నా తరచూ ఇంటిని సందర్శిస్తూ పర్యవేక్షిస్తుండాలని, అవసరమైతే అపార్ట్‌మెంట్/కాలనీ సొసైటీ సభ్యుల, సహ యజమానుల సహకారం తీసుకోవాలని పేర్కొంటున్నారు. కాలనీ, అపార్ట్‌మెంటుకు విధి నిర్వహణలో భాగంగా వచ్చే బీట్ కానిస్టేబుల్, బ్లూకోల్ట్స్ బృందాలతో మాట్లాడాలని,అద్దెకు ఉంటున్న వారిని పిలిచి పోలీస్ అధికారులను పరిచయం చేస్తే మోసం చేసే వారిలో కంగారు కనిపించే అవకాశముందని అంటున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చే వాళ్ళు అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహటించాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
previous post