గత కొన్నేళ్లుగా జనసేన ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ జనసేన కేడర్ చేస్తున్న ప్రచారానికి ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. స్వయంగా పవన్ కళ్యాణ్ దీని పై క్లారిటీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తన బలమైన ప్రత్యర్థిని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేయడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ధీంతో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆశలు పెట్టుకున్న కొందరు కాపులతో పాటు కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య, సోదరుడు నాగబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాన్ పెద్ద షాక్ ఇచ్చినట్టయింది. జనసేన సింగిల్ గా పోటీ చేయలేదా ? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరా? అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఒక మైండ్ గేమ్ అని పవన్ తేల్చేశారు. ప్రధాన పార్టీలన్ని విడిగా వెళితే ఓట్లు చీలి అది వైసిపికి అనుకూలంగా మారుతుందని, అది ఆ పార్టీకి లాబించి మళ్లీ రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, ఈసారి ఆ అవకాశం వైసీపీకి ఇవ్వదలుచుకోలేదని పవన్ కూడా స్పష్టం చేశారు. అందుకే విడిగా కాకుండా వచ్చే ఎన్నికలలో టిడిపి, బిజెపి తో కలిసి వెళ్లాలని డిసైడ్ అయినట్లు పవన్ చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని తిరిగి వెనక్కి పంపడమే తన టార్గెట్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని ఆ పార్టీ నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగని రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ చేసింది కూడా ఏమీ లేదని అన్నారు. తన టార్గెట్ ముఖ్యమంత్రి కావడం కాదని వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి కావాలని అడగాలంటే అందుకు ఒకస్ధాయి ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీతో సోదరుడు నాగబాబు ఉత్సాహంపైన కూడా నీళ్ళు చల్లేశారు. నాగబాబు ఎక్కడ పర్యటించినా, ఎవరితో మాట్లాడినా రాబోయేది జనసేన ప్రభుత్వమే, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చేగొండి హరిరామ జోగయ్య అయితే పదేపదే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ ఉంటేనే కాపులు జనసేనకు ఓట్లేస్తారని చెబుతున్న విషయం తెలిసిందే. పవన్ తాజా ప్రకటనతో జోగయ్యకు కూడా షాక్ కొట్టినట్లే అయ్యింది. జోగయ్య లెక్కప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ను ప్రకటిస్తారని, కాపులంతా పవన్ కు ఓట్లేస్తారని చెప్పారు. మరిప్పుడు ముఖ్యమంత్రి రేసులో తాను లేనని స్వయంగా పవనే ప్రకటించారు. ఇపుడిదే కాపు సామాజికవర్గంలో పెద్ద చర్చగా మారింది. 2019 ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇపుడు ముఖ్యమంత్రి పదవిని అడిగి ఉండేవాళ్ళమని పవన్ చెప్పటమే చర్చకు దారి తీసింది. పార్టీ తరపున ఎంఎల్ఏలు లేనపుడు తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగినా ఉపయోగం ఉండదని పవనే అంగీకరించడం జరిగింది. తన చేతిలో ఎంఎల్ఏ సీట్లు లేనపుడు టీడీపీ అయినా బీజేపీ అయినా తనను ఎందుకు సీఎంను చేస్తారంటు ఎదురు ప్రశ్నించారు. కండీషన్లు పెడితే ముఖ్యమంత్రి పదవి రాకపోగా చివరకు పొత్తుకూడా కుదరదని పవన్ తేల్చేశారు. తమ పార్టీల ఉమ్మడి అభ్యర్థి మాత్రమేనని ఎన్నికలలో ముందు వైసీపీని ఓడించిన తర్వాత జనసేన పార్టీ వ్యూహాలు ఉంటాయని ఆ తర్వాత తాము స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.