.
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..
మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు పద్దును ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని విపక్షం నిలదీయనుంది..
మరోవైపు సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. ఇంటర్నెట్‌ను ప్రజలందరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును పరిగణనలో తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్‌ఫేక్, పౌరసత్వ సవరణ చట్టంపైనా ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు..
అసెంబ్లీ కూడా..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఈరోజే ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది..
తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది..
ఈ భేటీలో ఈసారి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం రోజున చర్చ జరగనుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశ పెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది. మరోవైపు శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు.. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ శాసన సభా పక్షనేత జగన్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది