ఒరిస్సా అడ్డాగా పెద్ద ఎత్తున గంజాయి ఇతర ప్రాంతాలకు అక్రమ మార్గాలలో తరలిస్తున్నారు. ఢిల్లీ తో సహా ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే పెద్దఎత్తున గంజాయి సరఫరా జరుగుతుంది. ఒరిస్సాలోని కోరాపుట్ దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఏ.ఎస్.ఆర్ జిల్లా మీదుగా నగరానికి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలించి ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న కొందరు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఒ లింకులు బయటపడ్డాయి. పట్టుబడ్డ గంజాయి ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఆ గంజాయి ఎవరికి చేరుతుందనేది పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరకు, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా పండిస్తున్న గంజాయి పంటలను అధికారులు నాశనం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచిస్తున్నారు. అలాగే గంజాయి పంటను పండించడం చట్ట వ్యతిరేకమని అక్కడ వారికి పోలీసులు తెలియజేస్తున్నారు. దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం గంజాయి ఒరిస్సా నుంచి వివిధ మార్గాల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్నట్లు గుర్తించడంతో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. విశాఖ సిపి డాక్టర్ త్రివిక్రమ వర్మ, రేంజ్ డీ.ఐ.జీ హరి కృష్ణ మీడియా కు ఈ విషయాన్ని వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పోలీసులందరినీ ఆప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. సిటీ పరిధిలో ఉన్న 515 హోటల్స్ కి నోటీసులు ఇచ్చామని చెప్పారు. కొత్త వారు ఎవరొచ్చినా వెంటనే చెకింగ్ చెయ్యాలని చెప్పామని తెలిపారు. అదేవిదంగా ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్, కొరియర్ సంస్థలకు కూడా నోటీసులు జారీచేసి గంజాయి రవణాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. నగరానికి గంజాయి రావడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలలో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రేంజ్ లో ఉండే ఐదుగురు ఎస్పీలతో గంజాయి రవాణా అరికట్టడానికి ముఖ్యంగా తీసుకోవలసిన చర్యలు గురించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి క్లుప్తంగా చర్చించడం జరిగిందన్నారు. విశాఖను అడ్డాగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.