జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం. ఇది నిజమే కదా, మనలోని మైనస్ ల కోసం తెలుసుకునే బాధపడే కంటే, ప్లస్ లు తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు ఆచరణలో కూడా పెట్టాలి. ఒక గొప్ప స్థాయికి కాకపోయినా సరే ఉన్నంతలో అయినా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వస్తుంది. చరిత్రలో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఉంటుంది. ఎవరు ఊహించని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు ఇతరులకు స్ఫూర్తిగానే నిలుస్తారు. అటువంటి వారిలో ఈ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తులలో నిక్ వుజిసిక్ ఒకరు. ప్రపంచం మొత్తానికి మొటివేషనల్ స్పీకర్ గా తెలిసిన ఉజిసిక్ ఇటీవల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో మన తెలుగువాళ్ళ సెర్చింగ్ ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువైంది.. చేతులు, కాళ్ళు లేకుండా జన్మించిన అతన్ని చూసి జన్మ నిచ్చిన తల్లిదండ్రులే భయపడ్డారు. అటు స్కూల్లోనూ, ఇటు సొసైటీలోనూ ఎన్నో అవమానాలు.. చీత్కారాలు..చుట్టూ ఉన్న వాళ్ళ వేధింపులు. ఇవన్నీ భరించలేక డిప్రెషన్ కు లోనయి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిన ఆ వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. దాదాపు 60 దేశాలలో తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచిన ఆయన లైఫ్ ని ఒకసారి తిరగేస్తే ఎన్నో సంఘటనలు మనలను కదిలిస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి.. 1982 డిసెంబరు 4న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో దుష్కా, బోరిస్ వుజిసిక్ దంపతులకు జన్మించిన నిక్ ని పుట్టుకతోనే దురదృష్టం వెంటాడింది. టెట్రా-అమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వల్ల చేతులే లేకుండా పుట్టారు. కాళ్లు కూడా అంతంతమాత్రమే. పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తల్లయితే నాలుగు నెలల వరకూ అతన్ని చూసే ధైర్యమే చేయలేదు. కానీ ఎంతైనా కన్న మమకారం కదా ఇదంతా తమ ఖర్మ అనుకుని అతన్ని దగ్గరకు తీసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచే ప్రయత్నం చేశారు. నిక్ కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత .., సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో సాధారణ వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. నిక్ తన యవ్వన దశలలో ఎదురైన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో కానీ అనుకోకుండా ఓ రోజు తనలాగే కాళ్లూచేతులూ లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లో చదివాడు. అంతే తనలోని నిరాశని పక్కకి పెట్టేశాడు. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారీ లేచినిలబడగలిగితే విజయం దక్కితీరుతుంది,’ అన్నది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపించింది. తనంతట తానుగా ప్రతి పనినీ చేయగలగడం అలవాటు చేసుకున్నాడు. తోటివాళ్లతో పోటీపడుతూ చదువుకుని నిక్ తన 21వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ, ఆర్థిక ప్రణాళిక అంశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. కాళ్లూ చేతులూ లేని తానే జీవితంలో స్థిరపడగలిగితే ఇక మిగతావారు సాధించలేనిది ఏముంటుంది? అన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోయాడు. మనం పనికిరానివారం అనుకోవడం ఒక పెద్ధ అబద్ధం’ అన్నది నిక్ మాట. ‘జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టిగ్ పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం,’ అన్నది అతని సూత్రం. 2005లో “లైఫ్ వితౌట్ లింబ్స్”అనే అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో “ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్” అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు. అదే సమయంలో నిక్ “ద బటర్‌ఫ్లై సర్కస్” అనే లఘు చిత్రంలో నటించాడు. 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో షార్ట్ ఫిలింలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు. 2011లో “సమ్‌థింగ్ మోర్” అనే మ్యూజికల్ వీడియోను నిక్ విడుదల చేసాడు.2012లో కానే మియహరాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. వారు దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. కేవలం ఉపన్యాసాలే కాదు తన జీవితానుభవాలతో ఆయన లైఫ్ వితౌట్ లిమిట్స్ లాంటి పుస్తకాలు కూడా రాశాడు. ఆ ఒక్క పుస్తకమే 30కి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. నిక్ కాళ్లూ చేతులూ లేవు కదా అని అతను ఏ పనీ చేయకుండా కూర్చుంటాడని అనుకోవద్దు. ఫుట్బాల్, గోల్ఫ్ లాంటి ఆటలు ఆడేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి సర్ఫింగ్లో విన్యాసాలు చేస్తాడు. అతను రెండు చిన్న పాదాలను కలిగి ఉన్నందున, వాటిని అతను “చికెన్ డ్రమ్ స్టిక్” అని పిలిచేవాడు వాస్తవంగా అతని “చికెన్ డ్రమ్ స్టిక్” గా పిలిచే అతని పాదాల వ్రేళ్ళు కలిసిపోవడం ద్వారా వాటిని విడదీయడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. దీని వల్ల అతను వస్తువులను పట్టుకోవటానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులకు చేయడానికి వ్రేళ్ళుగా ఉపయోగించేవాడు. అతను తన పాదాన్ని విద్యుత్ చక్రాల కుర్చీని నడపడానికి, కంఫ్యూటర్, మొబైల్ ఫోన్ లను ఉపయోగించడానికి వినియోగించేవాడు. అతని జీవితం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపింది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించింది. జీవితంలో పైకి ఎదగాలనే ఆకాంక్షను పెంచింది.