Vaisaakhi – Pakka Infotainment

ప్రకృతి అద్భుతం… ఆయుర్వేద అమృతం ‘ తిప్పతీగ ‘

ప్రకృతి ఓ అద్భుతం.. మనిషి కి కావాల్సినవన్నీ ఇచ్చింది.. అవన్నీ ఇవ్వకపోతే సైన్స్ కూడా ఏం చేసేది కాదు. ఆహారం… ఔషధాలు .. మూలికలు.. మొక్కలు ఎన్నో అందించింది .. వనాల్లోనే కాదు ఆఖరికి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల్లా వుండే వాటిల్లో కూడా ఔషద గుణాలను దాచిపెట్టింది. వాటన్నిటినీ ఆయుర్వేదం పరిపుష్టం చేసి వైద్యం లో నిక్షిప్తం చేసింది.. వేల సంవత్సరాల నుండి ఈ ఔషదమొక్కలు ఆయుర్వేదం లో భాగమై ప్రాణాధాతలు గా మారాయి..
అలాంటి అద్భుతాలలో తిప్పతీగ మహాద్భుతం. రోడ్డు పక్కన కరెంట్ పోల్స్ పై.., గోడలపై పాకే తీగ లా తమలపాకు లాగా మనకి కనిపించే ఈ మొక్క సర్వరోగ నివారిణి.. దీని శాస్త్రీయ నామం ‘టీనోస్పోరా కార్డిఫోలియ ‘ఆయుర్వేద మందుల్లో అధికంగా వాడే తిప్పతీగ పురాతన కాలం నుండి సాంప్రదాయ వైద్యంలో మెరుగైన రోగనిరోధక శక్తి కోసం దీన్ని తీసుకుంటారు. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. రోజు రెండు ఆకులను నమిలితే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.

గిలోయ్ అనే గ్లూకోసైడ్, టెనోస్పోరిన్, పామరిన్, టెనోస్పోరిక్ యాసిడ్ తిప్పతీగలో ఉంటాయి. ఇది కాకుండా తిప్పతీగలో ఐరన్, భాస్వరం, జింక్, కాపర్, కాల్షియం, మాంగనీస్ కూడా ఉంటాయి. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు వుంది. అజీర్తి సమస్య వున్నవారు తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు… అజీర్తి సమస్య పోతుంది. అలాగే తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వున్న తిప్ప తీగ లో దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. తిప్పతీగ పొడిని వేడి పాలలో అల్లం కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.
20 నుంచి 30 మిల్లీ లీటర్ల తిప్పతీగల కషాయాన్ని తీసుకొని అందులో అల్లం పొడి లేదా పాలు వేసి తాగితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది.
ఆయుర్వేద అమృతం అన్నారు కదా అని తిప్పతీగని అధికంగా తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుల సలహా, సూచనలతో మాత్రమే తిప్పతీగను వినియోగించాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాడకూడదు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More