ముద్రగడ పద్మనాభం తాజా లేఖ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఆ లేఖలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. అధికార పార్టీలో ఉండే నాయకులు స్పందించి పవన్ కు గట్టిగా సమాధానం చెబుతారని అందరూ భావించారు. కానీ కాపు నేత ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చి పవన్ పై ఘాటు విమర్శలు చేయడమే ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న కీలక సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులు వల్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సామాజిక వర్గంతోనే వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలోని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కావాలని వినిపిస్తున్న నినాదం నిజం కావాలంటే టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ముద్రగడ విడుదల చేసిన లేఖలో ఎద్దేవా చేశారు. ఒక వీధి రౌడీలా ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కాపు ఉద్యమానికి ఎంతో సహాయం చేశారని ఆ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని అటువంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఒకపక్క రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, మరోపక్క నేనే ముఖ్యమంత్రి అంటూ బహిరంగంగా ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ముందు 175 స్థానాలలో పోటీ చేసి ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి అనే ప్రకటన చేయాలని ముద్రగడ పేర్కొన్నారు ముద్రగడ లేఖ కు జనసేన నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ముద్రగడపై నెగిటివ్ కామెంట్లు పెడుతూ అతనిని ఘాటుగా విమర్శిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఆధిపత్యపోరాటం కొనసాగుతున్నట్లు తాజా ఘటనతో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో కాపులకు తానే పెద్దదిక్కు అన్నట్లు ఒకపక్క ముద్రగడ వ్యవహరిస్తుంటే మరోపక్క కాపు సామాజిక వర్గానికి తన వల్ల న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయడంలో భాగంగానే ముద్రగడచే వైసిపి పార్టీ లేఖ రాయించి మరో ఎత్తుగడకు తెర లేపిందని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న సరే పవన్ కళ్యాణ్ మాత్రం తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర సంక్షేమం, ప్రజల మంచి కోసమే తాను ఆలోచించి మాట్లాడుతానని ఇందులో తనకు వ్యక్తిగత ఎజెండాలు అంటూ ఏవి ఉండవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసిపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే టిడిపి, బిజెపితో పొత్తులంటూ మరోపక్క చెబుతున్నారు. ఇంకోపక్క వారాహి యాత్రలో తనను ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా మార్చి వేస్తానని ప్రకటన చేస్తున్నారు. అటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ తానే ముఖ్యమంత్రి ఇంకొ పక్క ప్రచారం చేసుకుంటున్నాడు. ఇద్దరూ పొత్తులు పెట్టుకుని నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవడమే ఇప్పుడు విచిత్రంగా ఉంది. వీరిద్దరి తాజా వ్యాఖ్యలతో టిడిపి, బిజెపి, జనసేన ఏకాభిప్రాయంతో కలిసి వెళ్లడం లేదన్నది మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం లేఖ మాత్రం జనసేనకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ పార్టీ నేతలు ముద్రగడకు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ కాపు సామాజిక వర్గానికి తానే పెద్దదిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ముద్రగడ పవన్ కళ్యాణ్ పై అంత ఘాటుగా విమర్శలు చేస్తావా అంటూ జనసైనికులు మండిపడుతున్నారు.
previous post
next post