అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు
సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కీలక బాధ్యతలు అప్పటిస్తూ జిఓ ఎంఎస్ నెంబర్ 1250 జారీ చేసింది. 1998 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన మీనా అత్యంత సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా నిపుణతతో నిర్వర్తిస్తారనే పేరుంది. ప్రత్యేకించి 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా మీనా అందించిన సేవలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరు. ఎన్నికల ప్రశాంతంగా జరుగుతాయా అన్న చర్చకు ముగింపు పలుకుతూ పోలింగ్ ప్రక్రియను ముగించారు. హింసకు తావివ్యకుండా, రీపోలింగ్ వంటి పరిస్ధితులు సైతం ఎదురుకాకుండా గట్టి చర్యలు తీసుకుని శాంతి యుతంగా ఆ ప్రకియను పూర్తి చేయించారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక పోలింగ్ శాతాన్ని సాధించి ప్రజాస్వామ్య పునాదులను పటిష్టపరచటంలో తనదైన భూమికను పోషించారు. వివిధ రాజకీయ పక్షాలు తమ స్వలాభం కోసం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు చేసిన దుశ్చర్యలను ఉక్కుపాదంతో అణిచివేసి నియమబద్ద ఎన్నికలకు మార్గం చూపారు. మధ్యం, నగదు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేసి ఓటు హక్కు సద్వినియోగం అయ్యేలా చేపట్టిన చర్యలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
వ్యవస్ధలను గాడిలో పెట్టటం కత్తిమీద సామే
గనులు, ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. నిబంధనలకు విరుద్దంగా సహజ వనరుల దోపిడితో రాష్ట్రాన్ని బ్రస్ట్రు పట్టించారు. ఈ అవినీతి వ్యవహారాలను చంద్రబాబు నాయిడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఫలితంగా గత పాలకుల కుట్రలను వెలికి తీసే బాధ్యత కూడా మీనా పైనే ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇసుకను దూరం చేసి, నిర్మాణ రంగాన్ని అతాకుతలం చేసిన నాటి పాలకుల అకృత్యాలను బహిరంగ పరిచి రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబెట్టవలసి ఉంది. మద్యం విషయంలో జరిగిన కుంభకోణాలకు అంతే లేదు. ప్రజలు ప్రాణాలను హరించేలా నాణ్యతా రహిత బ్రాండ్లను ప్రవేశపెట్టి వేల కోట్లు వెనకేసుకున్న నాటి పెద్దల భాగోతం బహిరంగ వరచవలసి ఉంది. ఇలా దిగజారిన వ్యవస్ధలను గాడిలో పెట్టవలసిన అతి పెద్ద బాధ్యత ఇప్పడు ముఖేష్ కుమార్ మీనా పై పడింది.
రాజ్ భవన్ తొలి కార్యదర్శిగా పటిష్టమైన వ్యవస్ధ రూపకల్పన
రాష్ట్ర విభజన అనంతరం కొద్ది నెలల వ్యవధిలోనే అత్యంత కీలకమైన రాజ్ భవన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. నూతన రాజ్ భవన్ వ్యవస్ధకు అంకురార్పణ చేసి, అతితక్కువ కాలంలోనే దానికి ఒక సమర్ధ రూపును తీసుకువచ్చారు. సున్నా నుండి సమున్నత స్ధాయికి రాజ్ భవన్ తీసుకువెళ్లారు. రాష్ట్ర తొలి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసలు అందుకున్నారు. అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా రాజ్ భవన్ కార్యకలాపాలు జరిగేలా స్పష్టమైన ప్రణాళికలు అమలు చేసి ఆ వ్యవస్ధ ప్రతిష్టను ఇనుమడింప చేసారు. 2019 ఎన్నికల ఫలితాల తుదుపరి తొలుత సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా గిరిజనుల సంక్షేమం విషయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వారి అభివృద్దికి బాటలు వేసాయి. ఆర్ఓఆర్ యాక్టు అమలు విషయంలో పారదర్శకంగా, సమర్ధవంతంగా వ్యవహరించారు.
పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించిన మీనా
పర్యాటక, భాషా, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శిగా మీనా అధ్బుతాలు సృష్టించారనే చెప్పాలి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అవాంతరాలను అధికమిస్తూ రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రగా రూపుదిద్దే ప్రయత్నంలో విజయం సాధించారు. మీనా రెండు సంవత్సరాల పదవీ కాలంలో జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు, కేంద్ర ప్రభుత్వం నుండి 36 అవార్డులు పర్యాటక శాఖను వరించాయి. వరుసగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం నుండి సమీకృత పర్యాటక అభివృద్ది సాధించిన రాష్ట్రంగా ఎపిని నిలపటం సాధారణ విషయం కాదు. అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన “ఎఫ్1హెచ్20” పవర్ బోట్ రేసింగ్, బెలూన్ ఫెస్టివల్ వంటివి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పర్యాటక పటంపై సుస్దిర స్దానాన్ని కల్పించాయి. ప్రసాద్, స్వదేశీ దర్శన్, సాగరమాల వంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా రాష్ట్రానికి అత్యధికంగా నిధులు విడుదల చేయించిన ముఖేష్ కుమార్ మీనా, అయా పనులను సైతం నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయించి మన్ననలు అందుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంతో సహా రెండు పర్యాయాలు అబ్కారీ కమీషనర్‌గా విధులు నిర్వహించిన మీనా అత్యంత ప్రతిభావంతమైన అధికారిగా పేరు గడించారు. అక్రమమధ్యానికి అడ్డుకట్ట వేస్తూ జాతీయ స్ధాయిలో ఖ్యాతి గడించి అప్పట్లో ఎన్నికల కమీషన్ అభినందనలు అందుకున్నారు.తన సర్వీసులో విభిన్న పదవులను అలంకరించిన మీనా తనదైన శైలిలో పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. తన పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం, కర్నూలు కలెక్టర్, సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్ధ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్ధ ఎండి, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి, రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలో మీనా రాణించారు. పరిశ్రమలు (ఆహార శుద్ది), అర్ధిక (వాణిజ్య పన్నులు), చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సమర్ధుడు, సౌమ్యునిగా పేరున్న మీనాకు ప్రభుత్వం ఇప్పడు అందించిన బాధ్యతలు కత్తి మీద సామే అని చెప్పాలి.