Vaisaakhi – Pakka Infotainment

అన్నీ మంచి శకునములే…ఏపీ కి రానున్న ఏభై వేల కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్..?

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అభివృద్ధి ఫలాలను బాగానే ఇస్తున్నట్లే కనిపిస్తోంది.. నిన్న కేంద్రం నుంచి నిధులు ఈ రోజు భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు న్యూస్.. మార్పు మంచిదే అన్న సంకేతాలను ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. 50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా.. అందులో ఆంద్రప్రదేశ్ కూడా ఉండటం తో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఏడాదికి పన్నెండు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉన్న నేపథ్యంలో తూర్పు తీరంలో గానీ పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని నిర్మించాలన్న యోచనలో బీపీసీఎల్ ఉందని దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని బీపీసీఎల్ కి చెందిన ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణ కుమార్ సైతం ఈ వార్తలకు బలం చేకూరేలా ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీరప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోందని ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఎకనమిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను షేర్ చేస్తున్న టీడీపీ కూటమి శ్రేణులు.. ఏపీకి స్వర్ణయుగం మొదలుకాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు. 50 వేలకోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే.. స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని.. వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేదీ చూడాలి మరి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More