ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలుపే అజెండాగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ను మొదలు పెట్టేసాయి. ప్రత్యర్ధుల బలహీనతలు తెలుసుకుని మరి దాడిని సాగిస్తున్నాయి. రెండోసారి అధికారం చేజెక్కించుకునేందుకు వైసిపి అన్ని ప్రయత్నాలు మొదలెడితే ప్రతిపక్ష పార్టీలు మరోసారి వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని భావిస్తున్నాయి. టిడిపి, జనసేన ఇదే విషయాన్ని బహిరంగంగా స్పష్టం చేస్తూ బిజెపిని కూడా కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. టిడిపితో కలిసి వెళ్లేందుకు బీజేపీకి ఇష్టం లేకపోయినప్పటికి రాష్ట్రంలో బలంగా ఉన్న టిడిపి తో కలిసి వెళ్తేనే వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమనే విషయాన్ని గుర్తించిన జనసేన కేంద్ర పెద్దలకు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు సమయం ఉంది చూద్దాం, చేద్దాం అన్నట్లు బిజెపి కప్పదాటు సమాధానాలు చెబుతున్నప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం అటు బిజెపితోను ఇటు టిడిపితోనూ సంబంధాలను కొనసాగిస్తున్నారు. మూడు పార్టీలు ఎన్నికలకు కలిసి వెళితేనే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపికి పెద్దగా ఓటు బ్యాంకు లేనప్పటికీ కేంద్రపరంగా బిజెపి నుంచి రాష్ట్రానికి మరింత మంచి జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తప్పని పరిస్థితిలో బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు టిడిపి, జనసేనకు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 1985 ఫార్ములాని అమలుచేసి వైసీపీని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసిపి మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఈ ఫార్ములానే కచ్చితంగా అమలు చేస్తేనే అధికార మార్పు ఖాయమనే సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక ప్రయత్నాలు మొదలుపెట్టారు. టిడిపి, బిజెపితో మాత్రమే కాకుండా అవసరం అయితే కమ్యూనిస్టు పార్టీలతో కూడా కలిసి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు 1985 ఫార్ములా అంటే ఏంటి ? అనే విషయం అప్పటి వారికి చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ నేటి జనరేషన్ కు అది తెలియకపోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించి 9 నెలలోనే అధికారం చేపట్టారనే విషయం అందరికీ తెలిసిందే. 1983లో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏర్పడింది. 1984లో ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర రావు ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి అప్పటి గవర్నర్ రామ్ లాల్ ను నమ్మించారు. ఆయన దానిని అంగీకరించి ఎన్టీఆర్ ను తొలగించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. నిజానికి నాదెండ్ల భాస్కరరావుకు ఎమ్మెల్యేల బలం లేదు. ఈ విషయం తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీలకు కూడా తెలుసు. అందుకే ఆనాడు ఎన్టీఆర్ కి సిపిఎం, సిపిఐ, బిజెపి అండగా నిలిచాయి. ఈ సంఘటన 1984 లో జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు బాసటగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాగింది. దీంతో ఎమ్మెల్యేల బలం ఎన్టీఆర్ కు ఉందన్న విషయాన్ని గుర్తించి కేంద్రంలోని రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్ రామ్ లాల్ ను పదవి నుంచి తప్పించారు. అలాగే ముఖ్యమంత్రి పదవి నుంచి నాదెండ్ల భాస్కరరావును కూడా తొలగించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు తోనే ఉన్నారు. దీనిని గమనించి ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 1985లో మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సమయంలో తనకు మద్దతు ఇచ్చిన బిజెపి, సిపిఐ, సిపిఎం మూడు పార్టీలకు కూడా తనతో కలిసి రమ్మని కోరారు. దీనికి కమ్యూనిస్టులు అంగీకరించలేదు.బిజెపి ఉన్న ఫ్రంట్ లో తాము ఉండబోమని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్టీఆర్ ముందుగా కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. సిపిఐ కి 21, సిపిఎం కి 21 చొప్పున ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అదే సమయంలో మిగిలిన సీట్లలో ఎన్టీఆర్ పోటీ చేయాల్సి ఉండగా తాను తీసుకున్న సీట్లలో 12 సీట్లను బిజెపికి కేటాయించారు. ఈ ఫార్ములా వర్కౌట్ అయింది. అటు ఎన్టీఆర్ బిజెపికి అలాగే సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఇదంతా ఒక ఫ్రంట్ గా కాకుండా ఏ పార్టీకి ఆ పార్టీతో సర్దుబాటుతో ఎన్టీఆర్ దీనిని సాధించగలిగారు.ఈ నేపథ్యంలో 1985లో ఎన్టీఆర్ భారీ మెజారిటీతో గెలిచి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఆ సమయంలో సిపిఐ కి 19, సిపిఎం కి 20 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అలాగే బిజెపికి 8 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఇదే ఫార్ములాని ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరమీదకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన తరచూ ఏపీలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెబుతున్నారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం అంటే పోటీలో టిడిపి, జనసేన మాత్రమే కాకుండా బిజెపి కూడా కచ్చితంగా పోటీలో ఉంటుంది కనుక ఇలా విడివిడిగా పోటీ చేయడం కంటే ఆయన 1985 నాటి ఫార్ములాని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ముందుగా చంద్రబాబు నాయుడుతో సర్దుబాటు చేసుకుని జనసేన పార్టీ ముందుగా ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఖరారు చేసుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం జనసేన అన్ని సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉండదు. జనసేనకు కేటాయించిన సీట్లలో కనీసం ఐదు లేక ఏడు సీట్లను బిజెపికి విడిచి పెట్టి ఆయా సీట్లలో జనసేన పోటీ నుంచి తప్పుకుంటుంది.అలాగని టిడిపి, జనసేన, బిజెపి ఒక ఫ్రంట్ గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం లేకుండా వచ్చే ఎన్నికలలో 1985 ఫార్ములాను అమలు చేసే అవకాశం యోచన లో జనసేన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
previous post
next post