Vaisaakhi – Pakka Infotainment

అపర జక్కన్న పద్మభూషణ్ సుతార్ విశ్వకర్మ

అప్పట్లో కాబట్టి తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల సంగతి ఎవరికి తెలియకుండాపోయింది.. ఇప్పుడలా కాదు.. నిర్మాణం ఒక్కటే కాదు… అది ఎవరి సృజన లో ఊపిరి పోసుకుందో.. ఎవరు దాని సృష్టికర్తో ఆసక్తి ఉన్న అందరికి తెలుస్తుంది.. ఇప్పుడు అలాంటి గొప్ప శిల్పి గురించే భారతదేశం మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల (597 అడుగులు) స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీ ఆర్ అంబేద్కర్ 125 అడుగుల శిల్పాన్ని రూపొందించిన ఆ అభినవ జక్కన్న పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్ విశ్వకర్మ 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని గోందూర్ గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయ, సమర యోధుల విగ్రహాల తయారీ కి ఏకైక ప్రత్యామ్నాయమనే చెప్పాలి ఈ 93ఏళ్ల శిల్పి సునిశిత శైలే అతన్నో గొప్ప శిల్పి గా మార్చింది. విగ్రహాలు చరిత్రకు చిహ్నాలు. చరిత్రలో నిలిచిపోయే ఎందరో మహానుభావులు,మహాత్ములు, దేవతల రూపాలు సైజ్ ఎంతదైన వాటికి ప్రాణ ప్రతిష్ట చెయ్యగలిగితేనే అది గొప్ప శిల్పం గా గుర్తింపు పొందుతుంది. అలాంటి ఎన్నో శిల్పాలు ఆయన చేతిలో ప్రాణం పోసుకున్నాయి.. కురుక్షేత్రంలో కృష్ణార్జునుల విగ్రహం గుజరాత్ లో 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నం, మహాత్మా గాంధీ ప్రతిమ, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లోని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ, తో పాటు ఎన్నో విగ్రహాల రూపకర్త ఆయన. ఇక హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం డిజైన్‌ అసోసియేట్స్‌ కాంట్రాక్టు అప్పగించింది. 146.50 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన 2016 ఏప్రిల్ 14న జరగగా కేసీపి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11.80 ఎకరాలు విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మారక ప్రాంగణ నిర్మాణాన్ని చేపట్టారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 50 అడుగుల విగ్రహ స్తూపం(పీఠం) నిర్మితమైంది. ఈ పీఠం వెడల్పు 172 అడుగులు కాగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం బరువు 465 టన్నులు దీని నిర్మాణానికి 791 టన్నుల ఉక్కు ను, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి(బ్రాస్) ఉపయోగించారు రోజూ సగటున విగ్రహ నిర్మాణానికి 425 మంది కార్మికులు రామ్ వాంజీ సుతార్ నేతృత్వంలో పనిచేశారు. 1999లో పద్మశ్రీ ,2016లో పద్మభూషణ్ అదే సంవత్సరం లో ఠాగూర్ పురస్కారాన్ని అందుకున్న సుతార్ మరో అద్భుత ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. అరేబియా సముద్రం లో ప్రపంచంలో అతిపెద్ద గుర్రపుస్వారీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని 397 అడుగుల ఎత్తు లో అంబరాన్ని చుంభిస్తున్న ఖడ్గం తో దీన్ని రూపొందిస్తుండగా.. మహారాష్ట్రలోనే మరో అతిపెద్ద విగ్రహం కూడా ప్రతిపాదనదశలో ఉంది. ముంబై లోని దాదర్ లో 425 కోట్ల రూపాయల వ్యయంతో 350 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సుతార్ శిల్పకళ లో ప్రాణం పోసుకోనుంది. చరిత్ర గుర్తులను మళ్లీ చరిత్ర కు అందిస్తున్న ఈ శిల్పి ని చరిత్ర ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుంది. ఆ చిహ్నాలను చూసుకుని జాతి మురిసిపోతూనే ఉంటుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More