తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలి. నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలని తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదని వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమని హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలన్నారు. తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది శ్రీ వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత శ్రీ కరుణాకర రెడ్డి. ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నది శ్రీ ధర్మారెడ్డి. తొలుత ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలి. శిక్షలు ఎవరికి, ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడన్నారు
• వైసీపీ కోరుకొంటున్న గొడవలకు అవకాశం ఇవ్వొద్దు
తిరుమల యాత్రకు వెళ్తున్న శ్రీ జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత అని ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఇస్తారా లేదా… ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలని ఆయన అన్నారు.అధికారులూ బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫువాళ్ళు కోరుకొనేది గొడవలే.
ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోంది. తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఈ తరుణంలోనూ వైసీపీ కుత్సిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకొంటున్నాను. వాళ్ళు కోరుకొంటున్న గొడవలు మనం ఇవ్వవద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లో ఉన్న వైసీపీ వ్యవహార శైలిపట్ల – పోలీసు శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేసారు.