తరచు వివాదాలు కొని తెచ్చుకుంటున్న ఇసై జ్ఞాని ఇళయరాజా మరో వివాదాన్ని రాజేశారు.. మళయాళ, తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని రెండు వందల కోట్ల రూపాయల బాక్సాఫీస్ సక్సెస్ ని అందుకున్న మంజుమ్మల్ బాయ్స్. చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించారు. సినిమా క్లైమాక్స్‌లో కమల్ హాసన్ నటించిన ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోదు ’ పాటను అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.. అయితే ఇక కాపీరైట్ చట్టం ప్రకారం.. పాట హక్కులు పొందిన రెండు మ్యూజిక్ కంపెనీల నుండి మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు హక్కులు కొనుక్కుని, అనుమతి తీసుకుని చిత్రానికి వాడుకున్నారు.. అయితే ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని సినిమాలో ఈ పాటను ఉపయోగించడానికి అనుమతి పొందాలంటే వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలా కాకుంటే.. కాపీరైట్ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన పాటల విషయంలో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎవరిని క్షమించని ఇళయరాజా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా టీజర్ లో కూడా తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడినట్లు సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అలాగే ఇళయరాజా సంగీత దర్శకుడు అవ్వడానికి ఎంతో ప్రోత్సహంచిన తన మిత్రుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యంకి సైతం నోటీసులు పంపించారు. చాలాకాలం పాటు ఎస్పీబీ మ్యూజిక్ క్యాన్సర్ట్ లలో ఇళయరాజా పాటలు పాడటం మానేయడం కూడా జరిగింది. అలాగే చెన్నైలో ప్రముఖ స్టూడియో లో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసుకునేందుకు ఇచ్చిన లాబ్ స్థలం పై కూడా తనకే హక్కులున్నాయని కోర్ట్ కెక్కిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. నిర్మాతలు, మ్యూజిక్ సంస్థలు ఆల్రెడీ పాటల రైట్స్ కొనుక్కున్నా ఆ రైట్స్ సంగీత దర్శకులకు, సింగర్స్ కు ఎలా ఉంటాయి అన్న అంశం పై ఏకో, ఏ ఐ జీ, తదితరుల సంగీత సంస్థలపై ఇళయరాజా వేసిన కేసులో న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పాటల పై మ్యూజిక్ కంపెనీలకు, నిర్మాత లకు మాత్రమే హాక్కు ఉంటుందని వ్యక్తిగతం గా ఇళయరాజా కు ప్రత్యేక హక్కులు ఉండవని 2019లో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులు ని సవాల్ చేసిన ఇళయరాజా తరపు న్యాయవాది ని గీత రచయిత కూడా మీలాగే హక్కులు కోరితే ఏంటని ప్రశ్నించింది.. ఇటీవల ఓ తెలుగు సినిమా లో ఇళయరాజా ఓల్డ్ హిట్ సాంగ్ ని తిరిగి వాడుకున్నందుకు చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఇళయరాజా కు భారీ గానే సమర్పించుకుంది. మ్యూజిక్ సంస్థలకు డబ్బులిచ్చి ఆ పాటలు రైట్స్ కొనుక్కున్నా నా పాట వాడితే నాకు డబ్బులివ్వాల్సిందే అన్నది ఇళయరాజా డిమాండ్. ఇళయరాజా చేసే పనులతో ఆయన పాటలు పాడాలన్నా, సినిమాల్లో వాడాలన్నా కనీసం రింగ్ టోన్ లా వాడుకోవాలన్నా భయపడుతున్నారు. ఇళయారాజా పాటల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, కొన్ని సీన్స్ కి అనుగుణంగా కాపీ రైట్ నిబంధనలకు లోబడి తమ సినిమాల్లో ఇళయరాజా పాటలు పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఇళయరాజా వివాదాలపై తమిళ, మలయాళ మీమ్ పేజీలు ట్రోల్ చేస్తున్నాయి. కొంతమందైతే మీ పాటలు వినొచ్చా అని కూడా ట్రోల్స్ చేస్తున్నారు.. 2003లో “బీ.బీ.సి” నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం “దళపతి” సినిమాలో “అరె చిలకమ్మా” పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. అంతకు మించి వారి గుండెల్లో గుడి కట్టుకుని ఇళయరాజా ని ఆరాధిస్తున్నారు. అలాంటి తమ అభిమాన ఇసై జ్ఞాని ఇప్పుడెందుకు ఇలా స్పందిస్తున్నారో తెలియక తలలు పట్టుకుంటున్నారు.