‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే మంత్రంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. శ్రీ చక్ర సహితుడై సోదర సమేత మాతామహులతో సర్పాకారం లోసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మిచ్చే అరుదైన క్షేత్రం అది.. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా ఈ స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు.. ఈ దివ్య క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో భక్తులకు దర్శనమిస్తాడు. మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా తీర్చిదిద్దారు.. పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. పీఠభాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, పై భాగంలో కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతి కీ ప్రతీకలుగా నిలువగా మూలవిరాట్టు మధ్యభాగం లింగాకారం లో దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు.
ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది. మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉండగా సుబ్రహ్మణ్యేశ్వరుడి మూలవిగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం, శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు… ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి
ప్రతి ఆదివారం, మంగళవారం స్వామివారి దర్శనార్థం అనంతపురం జిల్లా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకొంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పై భాగంలో సింహా ధ్వజం, నరసింహ అవతారం, విష్ణు తత్వం శ్రీ కృష్ణదేవరాయ రాజవంశ ముద్రణ చూడవచ్చు. మధ్యలో స్వామి వారు మనకు శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు 1509 -1530 కాలం మధ్యలో శ్రీ కృష్ణ దేవరాయలు గురువు శ్రీ వ్యాస రాజు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఆలయ విశిష్టత తగ్గడంతో ఆలయానికి భక్తులు వచ్చేవారు కాదు. కానీ1980-90 మధ్య కాలం నుంచి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది.ఈ క్రమంలోనే 2008వ సంవత్సరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆలయాన్ని దర్శించి పార్వతి దేవి శివుడు విగ్రహాలను ప్రతిష్టించారు. పూర్వీకులు చెపుతున్నారు.. ఆ సమయంలో యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు (సప్త) కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా.. దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు మధుసూదన శాస్త్రి విగ్రహం విశిష్టత, మహత్యాన్ని పలువురికి వివరించి, గ్రామస్థులూ ఇతరుల సహకారంతో విరాళాలు సేకరించి, ఆ సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వివాహం కానీ వారికి వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం.కోరిన కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తికమాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత, బృందావనానికి తులసీదామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదేరోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసం రెండో ఆదివారంనాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగులచవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలూ, విశిష్ట అలంకరణలూ, విశేష పూజలూ నిర్వహిస్తారు. ప్రతి నెలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తారు. పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉందీ ఆలయం. బస్టాండ్ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి రావచ్చు. శ్రావణ, కార్తిక, మాఘమాసాలూ, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.