గత ప్రభుత్వం ప్రతిపాదిత రాజధాని అని ప్రకటించిన విశాఖ ఎప్పటినుంచో పర్యాటక రాజధాని.. కుళ్ళోత్తుంగ చోళ పట్టణం గా చారిత్రాత్మక నేపథ్యం వున్న ఈ తూర్పు కనుమల ప్రాంతం పర్యావరణానికి పెద్ద పీట వేసే పర్యాటక చిరునామా గానే దశాబ్దాలుగా కొనసాగుతుంది.. ఎన్నో టూరిజం స్పాట్లు మరెన్నో ఆహ్లాద క్షేత్రాలు.. ఈ జిల్లా సొంతం.. అలాంటి ప్రకృతి నిలయాలు ఇప్పుడు విద్వంసం గుప్పిట్లో చిక్కుకున్నాయి.. నిన్న ఋషికొండ ఈరోజు ఎర్రమట్టి దిబ్బలు . ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో అతి ముఖ్య భాగం.. ఇలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య వుంటే రెండోది తమిళనాడులోని పేరి వద్ద వుంది . అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై దాడి మొదలైంది..
విశాఖలో ఉన్న తొట్లకొండ-బావికొండ-పావురాలకొండ తీర ప్రాంతం, ఇక్కడ ఉన్న ఇతర బౌద్ధిక ప్రదేశాలు, రాష్ట్రంలో తీర ప్రాంతంలో, అమరావతి వరకు ఉన్న బౌద్ధ వారసత్వ ప్రదేశాలకు ప్రపంచ స్థాయిలో, ఎప్పుడో గుర్తింపు రావాల్సి ఉంది, కాని ప్రభుత్వాల ఉదాసీనత వలన అటువంటి గుర్తింపు రాకపోగా వాటిని విద్వంసం చేసే ప్రయత్నం పై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఎర్ర మట్టి దిబ్బల విద్వంసం పై ఆంధ్రప్రదేశ్ పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి ఈమెయిల్ ద్వారా ఎర్ర మట్టి దిబ్బలు సంరక్షణపై సవివరంగా ఉత్తరం రాయగా పర్యావరణ వేత్త , జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి కి పూర్తి వివరాలతో పర్యావరణ ప్రేమికుల తరఫున లేఖ రాశారు..
అందులో అనేక అంశాలను ఇతర రాష్ట్రాలు ఇటువంటి వాటిపై తీసుకుంటున్న చర్యలను, ఉదాహరణ లతో వివరించారు..
మన రాష్ట్రంలో వందలాది చారిత్రాత్మక, పురావస్తు సైట్ లు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా, నగరాల విస్తరణ కారణంగా, భూముల ధరలు అధికంగా పెరగడం వలన, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా కి, ఆ సైట్ లు గురి అవుతున్నాయని పేర్కొన్నారు… అటువంటి సైట్ లను పరిరక్షించే బాధ్యత, రాజ్యాంగం ఆర్టికల్ 49 క్రింద, మరియు, పురావస్తు సైట్ల పరిరక్షణ చట్టాల క్రింద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.
1978 లో, అప్పటి ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ వారు, దూరదృష్టితో, తొట్లకొండ చుట్టుపక్కల, 3,000 ఎకరాలకు పైగా, GORt నంబర్ 627 ద్వారా, “రక్షిత ప్రాంతం” గా నోటిఫై చేయగా, 2021 లో ప్రభుత్వం ఆ సైట్ ను 120 ఎకరాలకు కుదించే GO ను నోటిఫై చేయడం విశాఖ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. భీమునిపట్నం మండలం లో, కాపులుప్పాడ గ్రామంలో, పాత సర్వేనెంబర్ 314 లో చట్టం క్రింద, 3,000 ఎకరాల నోటిఫై అయిన, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి, అతిప్రాచీనమైన బౌద్ధ సైట్ విస్తీర్ణాన్ని 120 ఎకరాలకు కుదించే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ఆ విషయంలో విశాఖ పౌరులు AP హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. అటువంటి అమూల్యమైన చారిత్రాత్మిక ప్రదేశాలను పరిరక్షించే బదులు, రాష్ట్ర ప్రభుత్వం, సైట్ విస్తీర్ణాన్ని కుదించే దిశలో కోర్టు ముందు వాదించడం విశాఖ ప్రజలకు బాధ కలిగించింది. కోర్టువారు, కేంద్ర పురావస్తు పరిరక్షణ వ్యవస్థ (ASI) ను, తొట్లకొండ సైట్ ను సర్వే చేసి, రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ వ్యవస్థ అధికారులకు పూర్తి వివరాలు వెల్లడించకుండా, వారిని మభ్యపెట్టారనే సందేహం ప్రజలలో వచ్చిందని అందులో వివరించారు..
అమూల్యమైన వారసత్వ ప్రదేశాలను, పరిరక్షించే దిశలో, మన రాష్ట్రంతో పోలిస్తే, తెలంగాణ, హర్యాణ, బీహార్ వంటి రాష్ట్రాలు ముందంజ వేయడం గమనించాలని అలాగే తెలంగాణ ప్రభుత్వం, కొన్ని సైట్లకు, UNESCO గుర్తింపు కూడా తీసుకురాగలిగిందని గుర్తుచేశారు. హర్యానా లో ఉన్న అగ్రోహ పురాతన ప్రదేశంలో భూమిక్రింద నిక్షిప్తమైన చారిత్రాత్మక కట్టడాలను, రాడార్ టెక్నిక్ తో, పరిశోధన చేయడం కోసం, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ASI తో ఒప్పందం చేసుకుంది
అలాగే, బీహార్ రాష్ట్రప్రభుత్వం, కార్డిఫ్ యూనివర్సిటీ సాంకేతిక సహకారం తో, శాటిలైట్ ఇమెజింగ్ టెక్నీక్ ద్వారా, బోధ్ గయా లో భూమిక్రింద కప్పబడి ఉన్న కట్టడాల మీద పరిశోధన చేసి, ఎన్నో కొత్త కట్టడాలను ప్రజల దృష్టికి తీసుకురాగలిగారు
అయితే ఇక్కడి ప్రభుత్వాలు, తొట్లకొండ విషయంలో, నిర్వర్తించవలసిన బాధ్యత నిర్వర్తించలేదు. రెండు దశాబ్దాలకు ముందు, లార్స్ ఫోజిలిన్ అనే విదేశీ పరిశోధకుడు, తొట్లకొండ చుట్టుపక్కల, అప్పటి పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలో, క్షుణ్ణంగా పరిశీలించి, 134 కొత్త పురావస్తు సైట్లు, 328 కొత్త బౌద్ధిక అవశేషాలను రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన PhD థీసిస్, పుస్తకరూపంలో ప్రచురించబడింది. ముందున్న ప్రభుత్వాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిడికి లొంగి, ఆ విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోక పోవడమే కాకుండా, అందుకు వ్యతిరేకంగా కోర్టు ముందు వాదించడం వివాదాస్పదమైందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణం, రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న బౌద్ధ ప్రదేశాలను పరిరక్షించే దిశలో చర్యలు తీసుకుంటే, తీరప్రాంతంలో బుద్దిస్ట్ కారిడార్ కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలుగగలదు. నేషనల్ హెరిటేజ్ కంజర్వేషన్ పాలసీ (National Heritage Conservation Policy) నిబంధనలను పాటిస్తూ, అటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తేగలిగితే, ఆ కారిడార్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించగలదని సూచించారు. తొట్ల కొండ చుట్టుపక్కల ఉన్న 3,000 ఎకరాల సైట్ ను, పరిశోధన చేయించాలని విజ్ఞప్తి చేస్తూనే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖకు నేను రాసిన లేఖలను జత పరిచారు ముఖ్యంగా, శాటిలైట్ ఇమేజే (satellite imagey) దృష్ట్యా, బెంగళూరులో ఉన్న ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (NIAS) వారి సాంకేతిక సహాయంతో, మీ ప్రభుత్వం తొట్లకొండ సైటును (3,000 ఎకరాల విస్తీర్ణం) పరిశోధించాలి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో, అదే సంస్థ నలందా బౌద్ధిక సైటును పరిశోధన చేసి, కొత్త పురావస్తు అవశేషాలను, ప్రజలముందు పెట్టడం జరిగింది
ప్రభుత్వం ఆధ్వర్యంలో, తొట్లకొండ కుదింపు రద్దు అయి, రాష్ట్రంలో శ్రీకాకుళం (శాలిహుండం) నుంచి అమరావతి వరకు ఉన్న బౌద్ధిక సైట్లకు పూర్తి రక్షణ కలిగి, ప్రపంచ స్థాయిలో అటువంటి ఏకైక బుద్ధిష్ట్ కారిడార్ గా గుర్తింపు వస్తుందని దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని బొలిశెట్టి సత్యనారాయణ కోరారు.. ఉప ముఖ్యమంత్రి , పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ఇదిలా వుండగా చాలా కాలం నుంచి ఎర్రమట్టి దిబ్బల విద్వంసం జరుగుతున్నప్పటికీ ఇప్పుడే మొదలయినట్టుగా మాజీ మంత్రి గుడివాడ అమర్ వీటి గురించి ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం పై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.