Vaisaakhi – Pakka Infotainment

ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే…

ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత.స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తొలగించగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని, మళ్లీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం.
కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరశ్యకశిపుడు ఘోరం తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని, తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు.
హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో హిరణ్య కశిపుని భార్య లీలావతి గర్బవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే, ఇంకా అతడికి కొడుకు పుడితే వారు ఇద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయా రూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకొని పోతుండగా, దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు. ఓ గర్భిణినిచెరబెట్టి తీసుకుపోతావా? ఇంతనీచానికి దిగాజారుతావని నేననుకోలేదని గద్దించాడు. తాను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదని దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు. అయితే, ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని, ఒక గొప్ప హరి భక్తుడనే విషయాన్ని వెల్లడించాడు.
ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరి భక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు. సామ బేధ దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే, శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలమని భావిస్తారు హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరికమేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరహామూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహ మూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు. తదనంతరం మరికొంతకాలానికి
పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి అది ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్క డే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై వున్నానని, వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు.
స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెదికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామి మరో సారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని, వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యంకావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని (500 కేజీలు) సమర్పిచడం జరుగుతుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More