Vaisaakhi – Pakka Infotainment

నోట్ల రద్దు రాజకీయ వ్యూహమా..?

2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తునే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రూ. 2,000 నోటు రద్దుపై గత కొన్నేళ్లుగా ఇలాంటి ఊహగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ నేడు అదే నిజమైంది. ఆకస్మాత్తుగా ఆర్బీఐ రూ.రెండువేల నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే పెద్ద నోట్ల రద్దు అనివార్యమని చంద్రబాబు నాయుడు ,జే డీ లక్ష్మీ నారాయణ వంటివారు డిమాండ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఆర్బీఐ కి లేఖ కూడా రాసారు. ఎన్నికల ముందే రూ.2 వేల నోటు రద్దు అనేది ఉద్దేశపూర్వకంగానే భావించవచ్చు. రెండువేల రూపాయల నోట్ల రద్దు ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నా..కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యూహంలో భాగంగానే పెద్ద నోటు రద్దు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆ వెంటనే పెద్ద నోటు రద్దు చేయడం వెనక బిజెపి ప్రభుత్వం ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద నోట్లను బయటకు తీశారనే ప్రచారం కూడా జోరందుకుంది. అక్కడ బిజెపి వ్యతిరేక ఓటు కాకుండా ఓటర్లకు పంచిన డబ్బే కాంగ్రెస్ కు భారీగా పోలింగ్ జరిగేందుకు కారణమైందని బిజెపి భావిస్తుంది. ఇక వచ్చే ఎన్నికలలో మిగతా రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని భావించిన బిజెపి ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడానికి కారణంగా కొంతమంది భావిస్తున్నారు.. ఆర్బీఐ చెప్పిన గడువు వరకు నాలుగు లక్షల కోట్ల కు పైగా సర్క్యులేషన్ లో ఉన్న టూ థౌజండ్ డినామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ. తక్షణం ఇప్పటి నుంచే అమలులోకి వచ్చేలా నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2020 లో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అన్ని రూ. 2000 నోట్లను అత్యవసరంగా ఆర్‌బీఐ తరఫున బ్యాంకుల డబ్బును నిల్వ చేసే ప్రదేశంకు తరలించాలని తన బ్రాంచ్‌లను ఆదేశించిందని, దీంతో ఆ నోటును రద్దు చేస్తున్నారని ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయని “బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఇండియా” అనే వెబ్‌సైట్‌ ఫిబ్రవరి 10, 2020న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనే ఏటీఎంల నుంచి రూ. 2000 నోటు రావడం లేదని, అసలు అది చెలామణిలో ఉందా, ముద్రణ చేస్తున్నారా బ్లాక్‌మనీ భయంతో రెండువేల నోట్‌ను చెలామణిలో లేకుండా చేస్తున్నారా? అని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ ఆ నోటు అదృశ్యంపై ఆర్‌బీఐ నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరణ కోరారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆర్‌బీఐ రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలిపే గణాంకాలను వెల్లదించింది. 2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన ఆర్‌బీఐ. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఆ గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ఉండగా పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు నకిలీ కరెన్సీకి పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది.ఎక్కువ విలువ నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం ముఖ్యంగా బ్లాక్‌కు మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్‌లో క్యాష్‌ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోడానికే ప్రభుత్వం రెండు వేల నోట్ల చెలామణినికి తగ్గించి ఉండొచ్చనే అభిప్రాయాలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే తాజా ఆర్బిఐ నిర్ణయం వల్ల బ్లాక్‌మనీతో పాటు, క్యాష్‌ఫ్లో సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు.వంద రూపాయల నకిలీ నోటు ముద్రణకు, రెండు వేల రూపాయల నోటు ముద్రణకు ఖర్చులో తేడా స్వల్పంగా ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారుల ఆప్షన్‌ సహజంగా పెద్ద నోటే అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పక్క దేశం పాకిస్తాన్ ఆర్థికమాన్యంగా కొట్టుమిట్టాడుతుంది. చాలావరకు పెద్ద నోట్లు అక్కడ ముద్రించి వాటిని ఇండియాలో చెలామణి చేస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు ఈ దొంగ నోట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే నేడు ఆర్బిఐ పెద్ద నోటు రద్దు చేసిందని కొందరు కేంద్ర పెద్దలు చెబుతున్నారు. 2016 నాటి నోట్ల రద్దు బ్లాక్ మనీని నిరోధించాలనే ఉద్దేశంమే ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇతర పార్టీలకు ఫండ్స్ రాకుండా నిలిపివేయడం, ఎన్నికలలో బ్లాక్ మనీని ఉపయోగించకుండా ఉండేందుకు చేసిన ఎత్తుగడే ఆనాడు నోట్ల రద్దు అంశమని పలు రాజకీయ పార్టీల నేతలు ఆరోపణలు గుప్పించారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బ్లాక్ మనీ అని వంక చెబుతూ పెద్ద నోటు రద్దు చేశారని ప్రతిపక్ష పార్టీలు అభియోగాలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే భారీ నగదును జమ చేస్తున్న వారిపై నిఘా ఉంటుంది. వారిపై కేసులు నమోదు చేసి విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉంది. పూర్తిగా వారి బ్యాంకు లావాదేవీలను పూర్తిగా స్తంభించే అవకాశం కూడా ఉంది. దీంతో చాలామందిని కంట్రోల్ చేయవచ్చు అని, వచ్చే ఎన్నికలలో ఖర్చు చేసేందుకు ప్రతిపక్షాలకు ఎటువంటి బ్లాక్ మనీ అనేది లేకుండా చేయాలని బిజెపి వ్యూహం. కానీ బిజెపి నేతలే ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More