Vaisaakhi – Pakka Infotainment

రోడ్డు ప్రమాదాల అడ్డా విశాఖ రహదారులు

ప్రతిపాదిత రాజధాని గా వార్తల్లో ఉన్న విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరును చూస్తే వాహనదారుల నిర్లక్ష్యం స్పష్టం పాలకుల అలసత్వం రెండూ రహదారులను రక్తసిక్తం చేస్తున్నాయి.. మ‌ద్యం సేవించి వాహ‌నాన్ని న‌డిపే వారి వల్ల జరిగే ప్రమాదాల పర్సెంటే ఇందులో ఎక్కువ పీక‌లదాకా మద్యం సేవించి వాహ‌న‌దారులు వాహ‌నాల‌ను న‌డిపిస్తూ ఇత‌రుల ప్రాణాల‌ను కూడా బ‌లిగొంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారిపై జరగడం విశేషం. హనుమంత వాక జంక్షన్ నుంచి జూ పార్కు, ఎండాడ, మధురవాడ, కార్ షెడ్, మధురవాడ, కొమ్మాది, మారికవలస వంటి ప్రాంతాలలోనే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అతి వేగంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడంతో ఆ వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన అనేక రోడ్డు ప్ర‌మాదాల ఘ‌ట‌న‌ల‌కు కార‌ణాల్లో ఒక‌టి అతివేగం కాగా నిర్లక్ష్యం మరొక కారణం. త్వ‌ర‌గా గ‌మ్య‌స్థానాల‌కు చేరాల‌నే తొంద‌ర‌లో డ్రైవ‌ర్లు ప‌రిమితికి మించి వేగంతో వాహ‌నాల‌ను న‌డిపిస్తుంటారు. దీంతో ఒక్కోసారి వాహ‌నాలు గంట‌కు 120 కిలోమీట‌ర్ల నుంచి 140 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంటాయి. ఈ క్ర‌మంలో ర‌హ‌దారిపై ఏదైనా అడ్డుగా వ‌చ్చినా, లేదా ఆ స‌మ‌యంలో నిద్ర వ‌చ్చినా, ఆద‌మ‌రిచి ఉన్నా క్ష‌ణాల్లో జరిగే ప్ర‌మాదాలు ఎక్కువ. ఈ క్ర‌మంలోనే డ్రైవ‌ర్లు అతి వేగంతో నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డిపిస్తుండడం వ‌ల్లే చాలా వ‌ర‌కు రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందువ‌ల్ల ర‌హ‌దారుల‌పై వాహ‌నాలు ఎక్కువ వేగంతో వెళ్ల‌కుండా సంబంధిత అధికారులు ప‌ర్య‌వేక్షించాలి. స్పీడ్ గ‌న్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వాహ‌నాల వేగంపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే నిర్ల‌క్ష్యంగా నడిచే పాదచారులు రోడ్డు దాటే సందర్భాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల‌పై న‌డిచేట‌ప్పుడు ఎవ‌రైనా స‌రే ఒక‌టికి రెండు సార్లు వాహ‌నాలు వ‌స్తున్నాయో, రావ‌డం లేదో చూసుకుని మ‌రీ రోడ్డు దాటాలి. అలాగే పాద‌చారుల కోసం వాహ‌నాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో రోడ్ల‌పై సూచిక‌, హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలి. ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాలలో డ్రైవ‌ర్లు ప‌రిమితికి మించిన ప్రయాణాలు కొన్ని సంద‌ర్భాల్లో డ్రైవ‌ర్‌కే చోటు లేనంత‌గా వాహ‌నాలు కిక్కిరిసి పోతుంటాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జరుగుతున్నాయి. విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌ధాన ర‌హ‌దారుల నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో క్రాసింగ్‌లు స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం, సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డం, సూచిక బోర్డులు, హెచ్చ‌రిక చిహ్నాలు ఉండ‌క‌పోవ‌డం, ఒక్కో చోట ఇరుకుగా ర‌హ‌దారులు ఉండ‌డం, వంతెన‌ల‌పై రెయిలింగ్‌లు దెబ్బ తిన‌డం, అండ‌ర్‌పాస్‌లు, ఫ్లై ఓవ‌ర్లు అవ‌స‌రం ఉన్న చోట లేక‌పోవ‌డం, రోడ్లు దెబ్బ తిని గుంత‌లు ప‌డ‌డం, డివైడ‌ర్లు లేక‌పోవ‌డం వంటి అనేక నిర్మాణ లోపాల వ‌ల్ల కూడా రోడ్డు ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుంది. ఈ దిశ‌గా కూడా సంబంధిత అధికారులు ఆలోచించి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాలి. రోడ్ల‌ నిర్మాణాల్లో లోపాలు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల‌ను కొంత వ‌రకైనా నివారించ‌వ‌చ్చు. మ‌ద్యం సేవించ‌డం, నిద్ర లేకుండా సుదీర్ఘంగా వాహ‌నాల‌ను న‌డిపించ‌డం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖలో రోడ్ల‌పై జ‌రుగుతున్న అనేక ప్ర‌మాదాల్లో కొన్ని డ్రైవ‌ర్లు మ‌ద్యం సేవించి వాహ‌నాన్ని న‌డిపించ‌డం వ‌ల్ల కూడా జ‌రుగుతున్నాయి. పీక‌లదాకా మద్యం సేవించి వాహ‌న‌దారులు వాహ‌నాల‌ను న‌డిపిస్తూ ఇత‌రుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నారు. క‌నుక ఈ దిశ‌గా కూడా అధికారులు, ప్ర‌భుత్వాలు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి.. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నియంత్రించ వచ్చని విశాఖ సిపి డాక్టర్ త్రివిక్రమ వర్మ పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ ను వేసుకోవాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణిస్తే అది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా అతి వేగంగా వాహనాలు నడిపించడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. చాలామంది యువత ఈ ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు మైనర్ బాలురకు లేదా బాలికలకు వాహనాలు ఇవ్వరాదని చెబుతున్నారు. వారికి ట్రాఫిక్ నిబంధనలపై ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాహనాలను వేగంగా నడిపించి ప్రమాదాలకు కారుకులవుతున్నారని తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More