తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ని నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దంన్నర కాలంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం నలుమూలల వున్న తెలుగువారందరికి ఆధ్యాత్మిక పెద్ద దిక్కు గా ఆయన గుర్తింపు పొందారు.. అంతటి ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదన్నది నిర్వివాదాంశం. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన చేసిన ఉపమానాలు కొన్ని వివాదాలను కూడా సృష్టించాయి.. అవన్నీ పక్కన పెడితే ఆయన చాలామంది ఆధ్యాత్మికవేత్తల్లా సన్యాస జీవితం గడపడం లేదు. వృత్తి రీత్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నా ఆయన ప్రవృత్తి ఆధ్యాత్మికత. ఆయన సహధర్మచారిణి సుబ్రహమణ్యేశ్వరి వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ , నాగ శ్రీ వల్లి వీరి సంతానం. పొద్దున్న లేచి ఏ ఛానెల్లో చూసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన వీరి ప్రవచనాలే కనిపిస్తూవుంటాయి. ఓ వైపు ఉద్యోగం మరో వైపు ప్రవచనాలు.. ఎలా..? వ్యాపకాలు ఎలా వున్నా ఎన్ని ఉన్నా ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. లేట్ పెర్మిషన్స్ కూడా తీసుకోరు. కాకినాడలోని ఒక దేవాలయంలో శని, ఆదివారాల్లో ఇచ్చిన ప్రవచనాలను అనుమతి పొందిన కొన్ని ఛానెల్స్ రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. కొన్ని రీల్స్ గా స్టాటస్ లుగా కూడా వైరల్ అయిన సందర్భాలు వున్నాయి. నిజానికి ఆయనకు ఉన్న ప్రతిభాసంపత్తికి బయట ఉన్న పాపులారిటీ ని కమర్షియల్ గా లెక్క వేసుకుంటే కోట్ల వర్షం కురిసేదే.. ప్రవచనాలకు పారితోషికం తీసుకోకుండా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తారే తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు.. ప్రస్తుతానికి టూ బెడ్రూమ్ ఇంటిలో వుండే ఆయన ఆఫీసుకు తన మోటార్ సైకిల్ మీద వెళ్తారు. సెలవులను, లేట్ పర్మిషన్లు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు వినియోగించుకోలేదు. ఆరేడేళ్ల వయసులో తండ్రి కాలం చేసిననాటి నుంచే ఆయన శ్రమ మొదలయింది… అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగిన కృషి అద్వితీయం.. ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టారని చాలామంది అనుకుంటారు.. పూర్వజన్మ సుకృతంగా పరమాత్మ వరప్రసాదంగా లభించినవి మాత్రమే. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏముందో చెప్పగలిగే శక్తి ఆయన సొంతం.. భారత ప్రధానిగా పీవీ ఉన్న సమయంలో చాగంటి వారితో “మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండిత్య ప్రకర్ష అమోఘం. ఏమైనా అడగండి. చేసిపెడతాను” అంటే నవ్వేసి, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు.” అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. అది ఆయన నిస్వార్ధ జీవితానికి నిదర్శనం..