వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన బ్రిటీషర్స్ లో ఎక్కువ మంది మనదేశ సంపద ను దోచుకోవడానికో, భారతీయులను హింసించడానికో మాత్రమే పని చేశారు.. మానవత్వం పట్ల ఇక్కడి సంప్రదాయం.. సంస్కృతి పట్ల ఏ మాత్రం విలువ లేకుండానే వాళ్ళు పాలన కొనసాగించారు. భారతావని వారి దాస్యశృంఖలాలనుండి ఎప్పుడెప్పుడు బయట పడుతుందా అని వేచిచూడటమే భారతీయుల పని గా మారింది.. అటువంటి తరుణంలో కూడా కొంతమంది కారుచీకటి లో కాంతి పుంజాల్లా మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శించారు. అలాంటి వారిలో సర్ థామస్ మన్రో ఒకరు. ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఓ వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదైన ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు మరణిస్తే..ఆయా సంస్థలు విరాళల ద్వారా అందుకున్న భూములు, ఇతరఆస్థులన్నీ ఈస్ట్ ఇండియా పరమయ్యేలా చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంప్రకారం మంత్రాలయం మఠం ఆస్థులు, స్వాధీనపరుచుకోవటానికి కలెక్టర్ హోదాలో వెళ్లిన మన్రో చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి వెళ్లి కాసేపటి తరువాత ఆస్తుల గురించిగాని, స్వాధీనం గురించి గాని ఒక్కమాట కూడా మాట్లాడకుండా మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.ఎవ్వరికీ ఏమి అర్ధం కాలేదు. విషయం ఏంటని ఆరాతీస్తే మన్రో చెప్పిన మాటకు నిర్ఘాంత పోవడం అందరి వంతయింది.. బృందావనం లోకి వెళ్ళగానే ఆ ప్రాంతమంతా పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో, రాఘవేంద్రస్వామి దర్శనమిచ్చి స్పష్టంగా ఆంగ్లంలో మాట్లాడారట. అయితే మన్రో ఎవరితో మాట్లాడుతున్నారోమిగిలిన వాళ్ళకెవరికి అర్ధం కాలేదట.తనకి భౌతికంగా రాఘవేంద్రస్వామి కనిపించి మాట్లాడారు కాబట్టి, ఆయన జీవించి ఉన్నట్టే అని భావించి, చట్టం నుండి, మంత్రాలయం మఠానికి మినహాయింపుఇచ్చారు. ఈ విషయాన్ని నమోదు చేసిన గెజిట్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆయన తన డైరీలో, “వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా.. శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం” అని వ్రాసుకున్నారట. ఇదిలావుండగా హిందు సంస్కృతి పట్ల విపరీతమైన నమ్మకం ఉన్న ఆయన చిత్తూరు కలెక్టర్ గా ఉన్న సమయంలోనే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పెద్ద గంగాళాన్ని కానుకగా సమర్పించారు. దీనినే మన్రో గంగాళం అని వ్యవహరిస్తారు. ఇప్పటికి స్వామివారికి, దీనిలోనే నైవేద్యం పెడుతుండడం విశేషం. అంతే కాకుండా అనేక దేవాలయాలకు మాన్యాలిచ్చి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో గండి లోయ మీదుగా, గుర్రాలపై వెళుతున్న ఆయనకి ఎత్తులో కనిపించిన బంగారుతోరణం చూసి “ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?” అని, తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి, తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. అయితే వారిలో ఒక వృద్ధ సేవకుడు మాత్రం రామాయణ కాలంలో జరిగిన ఓ సంఘటన ను వివరించారు. సీతమ్మవారిని వెతుకుతూ అటుగా వచ్చిన శ్రీరాముడిని వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా, తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడట రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో, అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా, లోయపైన, ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. అయితే ఆ తోరణం పవిత్రాత్మ కలిగిన వారికి మాత్రమే కనిపిస్తుందని ఆ తోరణ దర్శనం చేసుకున్నవారికి, మరుజన్మ ఉండదని చెప్తూనే దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని అసలు విషయం చెప్పడం తో మన్రో మౌనంగా ఊరుకున్నారు. అయితే ఆరునెలలలోపే మన్రో కలరా సోకి1827లో మరణించాడు. ఆయన శరీరాన్ని గుత్తి పట్టణంలోని యూరోపియన్ శ్మశానవాటికలో ఖననం చేశారు తరువాత ఆ మృతదేహాన్ని వెలికితీసి మద్రాసులోని సెయింట్ జార్జి కోటలోని సెయింట్ మేరీస్ చర్చి ఆవరణలో సమాధి చేశారు. ఆయనపేర నేటికీ గుత్తిలో సత్రం ఒకటి ఉంది.రాయలసీమ రైతుల పాలిట పెన్నిధిగా ప్రశంసింపబడిన మన్రో విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు.