ఒకపక్క ఎండలు దంచి కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉండటంతో రుతుపవనాలు రాక కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే వర్షాల కోసం ఎదురుచూస్తున్న జనాలకు ఓ తుఫాను మాత్రం బాగా కలవర పెడుతుంది.అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘బిపర్ జాయ్’ మరింత తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యింది. చల్లటి వాన వస్తే చాలు అనుకునే జనానికి ఇప్పుడు ఈ భారీ తుఫాను గుదిబండలా మారనుంది. ఈ తుఫాను మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని 24 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించిన క్రమంలో తుఫాను కారణంగా ఏం జరగబోతుందోననే భయం మొదలయ్యింది. వచ్చే 3 రోజుల్లో ఉత్తర-ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదలి మరింత బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేయడం చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ తుఫాను ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి విరుచుకుపడుతుందోనని ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్ బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. గుజరాత్‌ను తాకకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలులూ వీస్తాయని చెప్పారు. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
previous post
next post