ఆ ఇద్దరు ఉద్దండులే.ఆయా రంగాలలో ఆరితేరిన వ్యక్తులే. అటు రాజకీయంగా గాని, ఇటు సినిమారంగంలో గాని, ఇటు సేవాపరంగా గాని చెప్పుకోదగిన గొప్ప వ్యక్తులలో ఆ ఇద్దరు ముందుంటారు. వారిద్దరు తారస పడటం కూడా చాలా అరుదు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు వేరే విధంగా మాట్లాడిన సందర్భాలనేవి కూడా లేవు. కానీ గత ఎన్నికలు ఆ ఇద్దరి మధ్య కొద్దిగా వైరాన్ని పెంచింది. అది ఎలా అంటే తీవ్రంగా దూషించుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఆ ఇద్దరు నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు అనే విషయం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇలా ఒకరికి ఒకరు ఎంతో గౌరవించుకుంటూ ఉండే వారి మధ్య రాజకీయ వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. గత ఎన్నికల ముందు మీడియా గుచ్చి గుచ్చి మరి పవన్ కళ్యాణ్ కోసం బాలకృష్ణని అడిగేసరికి అతనెవరో తెలియదన్నట్లు ఇచ్చిన సమాధానం తో నందమూరి, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ మరింత ఏర్పడింది. ముందు నుంచి చిరంజీవికి, బాలకృష్ణకు వృత్తిపరంగా పోటీ ఉండేది.అయితే తీవ్రత మాత్రం లేదు.అయితే ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా కుటుంబం భగ్గుమంది. పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి వెళ్లడం వల్లే గత ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చిందనేది జనసేన పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆ పార్టీ నేత, పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు బాల కృష్ణ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలు చేయడానికి కారణం పదేళ్ల క్రితం తన సోదరుడు చిరంజీవిని అవమానించే విధంగా బాలకృష్ణ మాట్లాడారని, ఇప్పుడు అది గుర్తుకొచ్చి బాధతో, కోపంతో బాలకృష్ణ పై వీడియోలు చేస్తున్నానని నాగబాబు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న సమయంలో ఆ సినిమాల ద్వారా టిడిపి అధికారంలోకి వచ్చేది లేదని,అటువంటి కలలు కనడం మానేయాలని పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో విమర్శించారు మొత్తంగా ఎన్టీఆర్ పేరు మీద వచ్చిన రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలి బాలకృష్ణకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అదేసమయంలో పవన్ కళ్యాణ్, నాగబాబులు చేసిన వ్యాఖ్యలపై కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది. వారి వ్యాఖ్యలపై ఎటువంటి కామెంట్ చేయనని బాలకృష్ణ సమాధానం చెప్పారు. ఇదిలా ఉండగా జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినప్పుడు ఫలితాలు అనుకూలంగా వచ్చాయని విడివిడిగా పోటీ చేస్తే ఫలితం ప్రతికూలంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైసిపిని గద్దె దించాలన్నదే ఇప్పుడు జనసేన, టిడిపి లక్ష్యం. అది జరగాలంటే మళ్లీ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే బిజెపి మాత్రం అటు ఇటుగా వ్యవహరిస్తు వైసిపి ప్రభుత్వం పైన కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆరోపణలు, విమర్శలు చేయడానికి అయిష్టతను చూపిస్తుంది. ఎప్పుడో కానీ సోము వీర్రాజు లాంటి వ్యక్తులు వైసీపీ ప్రభుత్వంపై రుసరుసలాడటం కనిపిస్తూ ఉంటుంది. జనసేనతోనే పొత్తు ఉంటుందని చెబుతూనే మరోపక్క వైసీపీతో అంట కాగుతున్న బిజెపి పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. తప్పదనుకుంటే బిజెపిని సైతం పక్కనపెట్టి తను ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని దించాలంటే అది బిజెపితో అయ్యే పని కాదని, టిడిపితో కలిసి వెళ్తేనే అది సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు టిడిపి, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే టిడిపి శ్రేణులు ఎవరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కానీ లేదా ఆ పార్టీ నాయకుల పై కానీ విమర్శలు చేయడం కంటే వారికి మద్దతు ఇచ్చే విధం గా మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల అమితంగా అభిమానాన్ని చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తారని ఆయన సన్నిహితులు కూడా గట్టిగానే చెబుతున్నారు. అయితే ఇక్కడ బాలకృష్ణ -పవన్ కళ్యాణ్ ఎదురుపడితే వారిద్దరి మధ్య జరిగిన వివాదం కోసం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆ విషయాన్ని వారిద్దరూ ఎప్పుడో మర్చిపోయారు. కొంతమంది రాజకీయ నేతలు, కొన్ని మీడియా సంస్థలు మళ్లీ వారిద్దరి మధ్య అగ్గి రాజేయడానికి సిద్ధమవుతున్నాయి. జనసేన- టిడిపి కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలుపు కష్టమని పలు సర్వేలు కూడా తేల్చి చెప్పాయి. టిడిపి, జనసేనను కలవనీయకుండా చేయడానికి గతంలో బాలకృష్ణ -పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి రచ్చ చేయాలని భావిస్తున్నారు. అన్ స్టాపబుల్ కార్యక్రమం తర్వాత బాలకృష్ణలో చాలా మార్పు వచ్చింది. చాలావరకు ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకునే విధంగా ఆలోచించడం మొదలు పెట్టారు. వ్యక్తిగతంగా బాలకృష్ణకు ఎవరితో విభేదాలు కానీ, వివాదాలు కానీ లేవు. వృత్తిపరంగానే పోటీ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ కలిస్తే గతంలో తమ మధ్య ఉన్న వివధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
next post