ఆస్ట్రేలియా సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని వస్తువు ఇస్రో ప్రయోగించిన రాకెట్ శకలమని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆస్ట్రేలియా అధికారులు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. అయితే అది ఎప్పటిది అనేది ఇస్రో అధికారులు స్పష్టత చేయాల్సి ఉందని చెబుతున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ వస్తువు కేబుల్స్ వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఇది చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు. ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎం. హెచ్. 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ వస్తువుకు సంబంధించి పరీక్షలను నిర్వహించిన అనంతరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్(PSLV)కి చెందిన శకలమని ఆస్ర్టేలియా స్పేస్ అధికారులు ప్రకటించారు. PSLV ప్రయోగ దశల్లో ఇలా శకలాలను సముద్రంలో పడేయడం సర్వ సాధారణంగా జరిగేదే. అయితే దీనిపై అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
previous post