Vaisaakhi – Pakka Infotainment

అష్టాదశ పురాణాల్లో ఏ పురాణం ఏంచెప్తుంది..?

అష్టాదశ పురాణాలు.. భారతీయ ఇతి హాస ప్రభంధాలు. శాస్త్ర రహస్యాలను.. ఆధ్యాత్మిక ధర్మాలను విపులీకరించే విశిష్ట కేంద్రాలు.. పురాణ ప్రస్తావన లేకుండా భారతీయత లేదు.. హిందూ ధర్మము లేదు.. భారతీయ దార్శనికతకు.. గతం, వర్తమానం, భవిష్యత్ గమనానికి ఇవే మార్గ దర్శనాలు.. పద్దెనిమిది పురాణాలు.., మరో పద్దెనిమిది ఉపపురాణాలు, వాటిల్లో లేని తాత్వికత లేదు తాంత్రికం లేదు, యంత్రంలేదు, మంత్రం లేదు… అణువు నుంచి బ్రహాండం వరకు అన్నింటిని స్పృశించి సమస్తం ఉన్న ఈ అష్టాదశ పురాణాల్లో అసలు ఎ వర్ణన ప్రధానమైనది.. ఏ అంశం విశేషమైనది.. మత్స్యపురాణం, కూర్మ పురాణం, వామనపురాణం, వరాహపురాణం, గరుడపురాణం, వాయుపురాణం, నారదపురాణం, స్కాందపురాణం, విష్ణుపురాణం, భాగవతపురాణం, అగ్నిపురాణం, బ్రహ్మపురాణం, పద్మపురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మవైవర్తపురాణం, లింగపురాణం, బ్రహ్మాండపురాణం, భవిష్యపురాణం, ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన మత్స్య పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. అలాగే
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన కూర్మ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన వామన పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు వరాహ పురాణంలో చెప్పబడ్డాయి. గరుడుని వివిధ సందేహాలపై శ్రీవిష్ణువు వివరణే ఈ గరుడ పురాణం ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు అసలు జనన మరణాలంటే ఏమిటీ..? మనిషి మరణానంతరం ఎక్కడికి చేరుకుంటాడు, ఏ పాపానికి ఎటువంటి శిక్షపడుతుంది… వంటి ఎన్నో కీలకమైన మార్మికమైన విషయాలను ఇందులో చర్చించారు. అదేవిధంగా వాయుదేవుడు చెప్పిన ఈ వాయు పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.మనం అన్వయించుకుంటే ఎక్కువ శాతం సైన్స్ ఇందులో కనిపిస్తుంది. అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ అగ్ని పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలు ఇందులో పొందు పరిచారు… కాశీఖండం, కేదారఖండం, కుమారి ఖండం, రేవాఖండం… తదితర ఖండాలుగా ఉండే ఈ స్కంద పురాణాన్ని స్వయంగా స్కందుడే చెప్పాడు… ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల కూడా ఉంటాయి. లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఈ లింగ పురాణం లో ఉంటుంది. బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ నారద పురాణం లో నిక్షిప్తం చేశారు. పద్మ పురాణంలోనైతే మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటాయి.. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ విష్ణు పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది..
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వంటివి ఈ మార్కండేయ పురాణం లో పొందు పరిచారు.. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ బ్రహ్మ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమే భాగవత పురాణం. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ బ్రహ్మాండ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. సూర్యుడు మనువుకు చెప్పిన ఈ భవిష్య పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. బ్రహ్మావైపర్త పురాణంలో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం వంటి విశేషాలు ఇందులో చర్చించారు..
నిజానికి ఈ పురాణాల్నీ కేవలం ఆధ్యాత్మికతాను మాత్రమే కాకుండా సృష్టి లో ఉన్న అన్నీ అంశాలను ప్రస్తావించారు.. వృక్ష, జంతు, పర్యావరణం, సైన్స్ అంతరిక్షం గురించి ఇలా ఒకటని కాదు అన్ని సవివరంగా చర్చించారు.. అందుకే ఈ అష్టాదశ ప్రభంధాలు.. మానవ జీవిత మనుగడకే నిర్ధేశనాలు…

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More