Vaisaakhi – Pakka Infotainment

తొలి ఏకాదశి ని శయన ఏకాదశిఅని ఎందుకంటారు..? దీని విశిష్టత ఏంటి..?

హిందూ సంప్రదాయంలో ఎన్నో పండగలు, పర్వదినాలు, విశిష్ట తిథులు, దేని కున్న ప్రాధాన్యత దానిదే… తిథులలో ఏకాదశి కున్న ప్రాముఖ్యత వేరు.. సంవత్సరం లో సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి. చాలా ఏకాదశులు వస్తున్నప్పటికీ కొన్ని ఏకాదశి లకు మాత్రం చాలా విశిష్టత వుంది.. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అని వ్యవహరిస్తుంటారు..
దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా వ్యవరిస్తారు ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటుంటారు.. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతే కాకుండాఇదే రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. అలాగే గోపద్మ వ్రతమును కూడా ఆచరిస్తారు. ఏకాదశి నుంచి కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఈ వ్రతం జరుపుకుంటారు.. అత్యంత
మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించ దలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. కష్టాలతో వున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించింట్లు పండితులు చెపుతున్నారు.

ఈ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.అలాగే కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు.. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఈ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More