Vaisaakhi – Pakka Infotainment

మొన్న అలా..నిన్న ఇలా..రేపెలా.?

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ పెరిగింది. ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. అధిష్టానం దగ్గర వి హెచ్ లాంటి సీనియర్లు అయితే కాంగ్రెస్ కు అధికారం కాదు కదా పట్టుమని పది సీట్లు కూడా రావు అని కుండబద్దలు కొట్టేశారు.. కంగారు పడ్డ అధిష్టానానికి అధికారం మళ్లీ మనదే అని వైస్సార్ గట్టిగా చెప్పొచ్చారు.. రెండోసారి అధికారాన్ని బంగారు పళ్లెం లో పెట్టి హై కమాండ్ కి అప్పగించారు.. వైఎస్ కి ఆరోజు అంత ధీమా ని ఇచ్చింది కాంగ్రెస్ కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ. కాంగ్రెస్, టిడిపి కంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం మొదలు పెట్టిన చిరంజీవి ఎక్కడ మీటింగ్ పెట్టిన లక్షలాదిగా వచ్చేవారు. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ఏకమవ్వడం మెగా అభిమానుల సపోర్ట్ తో సీఎం సీఎం అంటూ అభిమానులు తెగ హడావిడి చేసేవారు. కచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి చిరంజీవి సీఎం అవుతారని మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. ఊహించని విధంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ సునాయాసంగా విజయం సాధించి ఉండేది. అప్పటికే ప్రజలలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలావరకు అటు టిడిపికి, ఇటు ప్రజారాజ్యం పార్టీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి లాభించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలకపోయి ఉంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. ఇదంతా గతమే కావచ్చు అదే మళ్ళీ భవిష్యత్ అయితే అన్న ప్రశ్న తోనే ఈ ఆలోచన గత ఎన్నికలలో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి ని మరోసారి చవి చూసింది. తెలుగుదేశం- జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసి అధికారాన్ని వైసిపికి అప్పగించాయి. అంతకుముందు టిడిపి- జనసేన మధ్య పొత్తు ఉండేది. ఆ రెండు పార్టీలు బిజెపితో కలిసి వెళ్లాయి. బిజెపితో టిడిపికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా 2019 ఎన్నికలలో బిజెపి డైరెక్షన్లో టిడిపిని వీడి పోటీకి వెళ్ళింది. ఫలితం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల ముందు వరకు చెట్టా పట్టాలేసుకుని కలిసి తిరిగిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య బిజెపి చిచ్చు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడాలంటే టిడిపి అధికారంలోకి రాకూడదు అనే టార్గెట్ తో జనసేన- టిడిపి మధ్య అగ్గి రాజేసింది. ఈ విషయంలో బిజెపి నాయకుడు సోము వీర్రాజు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. అదే నిజమని టిడిపి నేతలు కూడా వెల్లడించారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా అడ్డుపడింది పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలిసిందే. నాడు అన్న చిరంజీవి వలన టిడిపి అధికారంలో రాకుండా జరిగితే నేడు తమ్ముడు పవన్ కళ్యాణ్ వలన మళ్లీ అదే రిపీట్ అయ్యింది. తెలుగుదేశం పార్టీని రెండుసార్లు అధికారంలోకి రాకుండా చేసిన ఘనత మాత్రం ఆ ఇద్దరు అన్నదమ్ములకే దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు వైసిపి ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని అంతర్గతంగా నిర్వహించుకున్న సమావేశాలలో వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. ఈసారి జరిగే ఎన్నికల తర్వాత అధికార మార్పు అన్నది ఖాయం గా తెలుస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వ తీరుపై విసిగిపోయి ఉన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో తమకు మంచి జరిగే నాయకుడినే ఎన్నుకుంటామని ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈసారి కచ్చితంగా అధికార మార్పు జరగబోతుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More