ఎన్నో త్యాగాలు.., మరెన్నో కూర్పులు.., బుజ్జగింపులు.., హామీలు…, తాయిలాలు.., కూటమి అధికారం లోకి వచ్చేందుకు ఇవి సెకండ్ డైమన్షన్.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓ వైపు పనిచేస్తే.. ఇంకో వైపు ప్రతి పక్ష నేతల చరిష్మా ప్రజలకు వారిపై వున్న నమ్మకం కూటమి అధికారం లోకి రాడానికి తోడ్పడింది.. ఇప్పుడిప్పుడే అన్ని గాడి లో పెడుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు పల్లకి మోసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్టుల భర్తీ పై కసరత్తు ప్రారంభించారు… మరో వారం రోజుల్లోనే నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం మొదలవ్వడం తో ఆశావహులు అమరావతి యాత్ర మొదలెట్టారు. అధికార తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకొంది. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను అధినేత సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి, సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట.
జిల్లా స్థాయిలో ఉద్యోగుల బదిలీలు అనంతరం పోస్టుల పందేరం ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు మార్పు చేర్పులు భారీ గా జరుగుతున్నాయి.. అనుకూలురైన బ్యూరోక్రాట్లను వేరే రాష్ట్రాల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ కు తప్పించుకోవడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గత ప్రభుత్వ హయాంలో పదవులు పొందిన వారిని రాజీనామాలు చెయ్యాలంటూ ప్రభుత్వ కార్యదర్శి జీవో విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, యూనివర్శిటీ వీ సీ లు, కీలక పదవుల్లో ఉన్న వారందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఖాళీ అయిన కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది. దీని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు వందకు పైగా తేలాయట.. వాటితో పాటు సామాజిక వర్గాలు, వాటికి అనుబంధంగా వున్న ఫెడరేషన్లు, జిల్లా స్థాయిలో నీటి సంఘాలు, వంటి పదవులను సైతం పరిగణనలోకి తీసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు.