రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .
సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.
వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. ‘ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు”
ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయని అన్నారు..ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్ స్టడీ. వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?. ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది. ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వక్తికి చెందిన ప్రాజెక్టు ఇది” అని చంద్రబాబు అన్నారు.