200 ఏళ్ల చరిత్ర గల ఇసుక కొండ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయం ఏర్పాటు విషయంలో ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. నగరం నడిబొడ్డున కేజీహెచ్ సమీపంలోని కొండపై వెలసిన ఈ ఆలయానికి రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. విశాఖలో సింహాచలం ,శ్రీ కనకమహాలక్ష్మి ఆలయాలకు చాలా ప్రాముఖ్యత గుర్తింపు ఉంది. ఈ ఆలయం సంబంధించి అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ విస్తృత ప్రచారం చేయకపోవడం వల్ల ఇంకా చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. 80వ దశకములో శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడం ద్వారా కొద్దో గొప్పో సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి జరుగుతూ వచ్చింది. చుట్టుపక్కల వాళ్లకు తప్ప దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వివరాలు అసలు ఏమీ తెలియవు. నిజానికి ఈ ఆలయం గురించి మరింత ప్రచారం చేసి ఉంటే భక్తులతో పాటు టూరిస్టుల సంఖ్య కూడా పెరిగి ఉండేది. 200 సంవత్సరాల క్రితమే 18వ శతాబ్దంలో ఈ గుడి కట్టి ఉంటారనే కొంతమంది అంటుండగా 19వ శతాబ్దం మొదటి దశలో గుడి నిర్మాణం జరిగిందని మరో ప్రచారం కూడా ఉంది.కొండమీద ఎవరో ఉత్తరాది బాబా బస చేసి అక్కడ సత్యనారాయణ మూర్తి పాలరాతి విగ్రహాలతో పూజలు చేశాడని, ఆ తర్వాత కాలంలో దాతలు చిన్న గుడి కట్టించారని కొందరు స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో చాలా మంది దాతలు ఈ ఆలయానికి విలువైన భూములను కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆలయానికి సంబంధించిన కొండ భూముల్లో ప్రజలు ఆక్రమించి కట్టుకున్న వాటిని దేవాదాయ ధర్మాదాయ చట్టం కింద తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దేవస్థానం అధికారులు భూ ఆక్రమణ నిరోధక కోర్టులో కేసులు వేసి వాటిని నడుపుతున్నారు. 1810 లో విశాఖపట్నంలోని కొత్తరోడ్డుకు సూర్యబాగ్ కు మధ్యలో నివాస గృహాలు లేవు. జిల్లా కేంద్రం అయిన ఇళ్ళ నిర్మాణాలు జరిగాయి.. విశాఖపట్నానికి తూర్పుదిక్కున సముద్రానికి ఇవతల ఉంది. ఆ కొండకు దక్షిణ దిశలో (కొండవాలులో) చెంగలరావు పేట, సీతారామస్వామి కోవెల వీధి, రాజప్ప నాయుడు వీధి, సోల్జియర్ పేట తదితర వీధులు ఉన్నాయి. అవన్నీ ఎత్తులో ఉన్నందువల్ల తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు నిలువవుండేవి కాదు.. ఇసుకకొండకు ఉత్తర దిక్కున ఇప్పుడు మహారాణిపేట ఉన్న ప్రాంతంలో కంపెనీ వారి సైనిక దళాలు ఉండేవి. సైనికులు ఉండే బారక్సును ఆ సమీపంలోని పల్లెల ప్రజలు బారకాసులు అనేవారు. వాటి మీద ఆధారపడి వివిధ వృత్తుల వారు జీవించేవారు. వైజాగ్ పటం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిస్థితుల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటికే జమీందారు చట్టం పోయి మున్సిపాలిటీ వచ్చేయడం వల్ల ఆలయాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఇసుక కొండపై సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 1857 లో సముద్ర ఉప్పెన వచ్చిందనే ప్రచారం ఉంది. దీని కారణంగా భారీగా ఎగిసిపడిన సముద్రపు అలలు ఆ కొండను అమాంతంగా ముంచేయడంతో సముద్రపు ఇసుక కొండపై అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది. అప్పట్నుంచి ఈ కొండకు ఇసుక కొండనే పేరు వచ్చింది. మళ్లీ అప్పటినుంచి కూడా ఆ తరహా ఉప్పెన విశాఖకు రాలేదని చెప్పవచ్చు. అందుకే బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వపు రికార్డులలో శాండ్ హిల్ అన్న పదం ఎక్కువగా కనిపిస్తుంది. 1857 ఉప్పెన వచ్చినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నప్పటికీ అది ఇంకా ముందే అంటే 17 వ శతాబ్దంలో జరిగి ఉంటాదని భావిస్తున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దత్తత తీసుకున్న తర్వాతే ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సంఖ్య కూడా పెరిగిందని ఆలయ ఈవో బుద్ధ లక్ష్మీ నగేష్ వైశాఖి డాట్ కామ్ తో అన్నారు. 200 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం అభివృద్ధికి ప్రభుత్వ కట్టుబడి ఉందని చెప్పారు.ఈ ఆలయానికి కేజీహెచ్ మార్గం తో పాటు కొత్త సాలి పేట కొండ దిగువ నుంచి ఆలయానికి మెట్ల మార్గం ఉన్నట్లు చెపుతూ దీనిని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని అలాగే పూర్ణ మార్కెట్ నుంచి భక్తుల సౌకర్యార్థం ఆలయానికి ఒక ఘాట్ రోడ్ ను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణం అందుబాటులోకి వస్తే భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
previous post
next post