తీరం దాటడం అంటే..?

నగరాలు, గ్రామాలు, అడవులు, అభివృద్ధి తీరాలు ఇలాంటి తేడాలేమి లేకుండా కన్ను పడ్డ ప్రతి దాన్ని అతలాకుతలం చేసేసిన తుపాన్లు అస్సలేమీ ఎరగనట్టు తీరం దాటేసి వెళ్లిపోతుంటాయి. ప్రచండ భీభత్సం ఎప్పుడు తీరం దాటుతుందా అన్ని ఎదురుచూస్తూ వుంటారు ఇంతకీ అసలు తుపాను తీరం దాటడం అంటే ఏంటి..? దాటడం అంటే అడుగుతీసి మరో అడుగువేసినట్టు ఈ ప్రక్రియ అంతా ఒక్క క్షణంలో జరిగేది కూడా కాదు. సముద్రంలో పుట్టిన ఒక మహా గాలి చక్రం, నెమ్మదిగా పయనిస్తూ భూమి మీదికి రావడాన్నే తీరం దాటడం అంటారు.

తుపాను అనేది వందల కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ మేఘాల గుంపు. ఆ గుంపు మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. శాస్త్రవేత్తలు దాన్ని తుపాను కన్ను అంటారు. తుపాను మొత్తం సముద్రంలో ఉన్నప్పుడు ఎవరికీ పెద్దగా ముప్పు ఉండదు. ఎప్పుడైతే ఆ మధ్యలోని కన్ను సముద్రపు నీటిని వదిలి, నేల మీదకు అడుగు పెడుతుందో, సరిగ్గా దాన్నే తీరం దాటడం లేక ల్యాండ్‌ఫాల్ అంటారు. తుపాను ఆకాశంలో తిరిగే ఒక పెద్ద రాక్షస బొంగరం లాంటిది. సముద్రపు నీటి మీద ఉన్నంత సేపు దానికి నీటి ఆవిరి అనే బలం దొరుకుతుంది. ఆ బలంతో అది మరింత వేగంగా తిరుగుతుంది. సముద్రంలో ఉన్నంత సేపు దానికి నిరంతరం శక్తి అందుతూనే ఉంటుంది. అందుకే అది మహా వేగంగా పరుగులు తీస్తుంది. ఎప్పుడైతే సముద్రం దాటి నేల మీదికి వస్తుందో, అప్పుడు సముద్రం నుండి వచ్చే శక్తి ఆగిపోతుంది. అయితే అప్పటికే దానిలో నిండి ఉన్న పవర్ అంతా ఆ చుట్టుపక్కల నేల మీద ఒకేసారి ఖర్చు చేస్తుంది. అందుకే తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయి.

తీరం దాటే సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది. దీనిలో మూడు అంచెలు ఉంటాయి. మొదట తుపాను ముందు భాగం నేలను తాకుతుంది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయి, కుండపోత వర్షం పడుతుంది.
ఆ తర్వాత తుపాను మధ్య భాగం, అంటే కన్ను నేల మీదికి వస్తుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం ఆగిపోతుంది. ఆకాశం నిర్మలంగా మారుతుంది. గాలి అస్సలు వీచదు. తుపాను వెళ్లిపోయింది అనుకుని జనం బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ అసలైన ప్రమాదం అక్కడే పొంచి ఉంటుంది. కాసేపటికే తుపాను వెనుక భాగం ఊరి మీదికి వస్తుంది. ఈసారి గాలి అంతకుముందు వీచిన వైపు కాకుండా, దానికి పూర్తి ఎదురు దిశ నుంచి అంతకంటే ఎక్కువ వేగంతో విరుచుకుపడుతుంది. తీరం దాటడానికి సాధారణంగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నేల మీదకు వచ్చాక తుపానుకు ఆహారమైన సముద్రపు తేమ అందదు. ఊళ్లు, చెట్లు, కొండలు దానికి అడ్డంకులుగా నిలుస్తాయి. దాంతో ఆహారం అందని మనిషిలాగా తుపాను క్రమంగా నీరసించిపోతుంది. గంటలు గడిచేకొద్దీ బలహీనపడి, సాధారణ వర్షంగా మారి తుపాను కనుమరుగైపోతుంది. ఇది తీరం దాటడం వెనుక కథా కమామీషు.

Related posts

బాస్ తో నెట్ ఫ్లిక్స్ షూటింగ్..!

స్టార్ లింక్ గోలేంటి..?

థియేటర్ల లోకి‘ 4కె పతివ్రతలు’

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More