టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఎంతో కళాత్మకంగా ఉండటమే కాకుండా చక్కని సందేశం కూడా ఉండేది. సామాజిక ఇతి వృత్తాలను తన సినిమాలకు కథ వస్తువుగా మార్చుకుని బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకున్నారు. శంకరాభరణం అనే సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎవర్గ్రీన్ మూవీ. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది ఈ మూవీ. ఈ సినిమానే కాకుండా ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు విశ్వనాథ్. అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం చిత్రాలు ఆయనకు మరింత పేరును తెచ్చిపెట్టాయి. అలాగే సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా అనే చిత్రాలలో ఆయన నటుడుగా కీలక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. సినిమారంగంలో చేసిన కృషికిగాను 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారుఅదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు సినీ రంగానికి అయన చేసిన సేవలను మరువలేమని పేర్కొన్నారు.