వంగవీటి మోహనరంగా జీవిత చరిత్ర ఆధారంగా ధవళ సత్యం దర్శకత్వంలో రూపొందిన చైతన్య రథం 1987 లో రిలీజ్ అయ్యి రాజకీయంగా సంచలన రేకెత్తించింది. ఇందులో వంగవీటి మోహన రంగ క్యారెక్టర్ తో పాటు అతని సోదరుడు రాధా క్యారెక్టర్ లు కీలకంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన చైతన్య రథం చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉన్నప్పటికి కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పు కోవాల్సి వచ్చింది.వంగవీటి మోహనరంగా క్యారెక్టర్ ను చిరంజీవితో చేయించాలని దర్శకుడు ధవళ సత్యం భావించారు. దీనికి వంగవీటి మోహన్ రంగ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవిని అప్రోచ్ అయ్యి డేట్స్ తీసుకోమని చెప్పారు. చిరంజీవి తో దర్శకుడు సత్యంకు అప్పటికే మంచి అనుబంధం ఉంది. చిరంజీవి హీరోగా జాతర అనే సినిమాను తీశారు. సామాజిక ఇతివృత్తాన్ని ప్రధాన కథగా తీసుకొని ఈ సినిమాను చేశారు. ఈ సినిమా అటు చిరంజీవికి ఇటు దర్శకుడు సత్యంకు కూడా మంచి పేరును తీసుకువచ్చింది. ఈ సినిమా కారణంగా వీరి మధ్య ఉన్న అనుబంధంతో చిరంజీవిని అప్రోచ్ అయ్యి చైతన్య రథం సినిమాలో వంగవీటి మోహన రంగా క్యారెక్టర్ చేయమని కోరడం జరిగింది. అందుకు చిరంజీవి కూడా తన అంగీకారాన్ని తెలియజేశారు. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందిగా చిరంజీవి కోరాడు.ఈలోపు ఇతర తారాగణాన్ని దర్శకుడు ఎంపిక చేసే పనిలో పడ్డారు. అప్పటికే ఈ సినిమాకి సంబంధించి వార్త బయటకు పొక్కడంతో పెద్ద చర్చ మొదలైంది.అప్పుడు టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. పేరుకి వంగవీటి మోహన రంగా జీవిత చరిత్ర అని చెప్పినప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకంగానే ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పేరు ఉన్న నటీనటులు ఈ సినిమాలో నటించేందుకు భయపడ్డారు. దీంతో తప్పనిసరి చిన్న ఆర్టిస్టులను, కొత్త వాళ్లను దర్శకుడు ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు వంగవీటి మోహనరంగా అతని సోదరుడిపై తప్పుడు ప్రచారం చేస్తూ వారి క్యారెక్టర్ లను దిగజార్చే విధంగా జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలని అసలు కథ ఏంటో వంగవీటి సోదరులు ఎలాంటివారో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేసేందుకు వంగవీటి మోహనరంగ సిద్ధమయ్యారు. షూటింగ్ కోసం అంతా రెడీ చేసుకుని మరోసారి దర్శకుడు చిరంజీవిని అప్రోచ్ అయ్యారు. అప్పటికే అప్ కమింగ్ హీరో అయిన చిరంజీవి వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యారు. కొత్తగా వచ్చిన హీరోలలో వరుసగా సక్సెస్ లు ఇస్తున్నారు. ఈ సినిమాపై బయట జరుగుతున్న ప్రచారం కు సంబంధించి చిరంజీవి వరకు వెళ్ళింది. ఈ సినిమా చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. కానీ రాజకీయంగా చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అది తన సినీ కెరిర్ పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. దర్శకుడు సత్యం తనుకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో చిరంజీవి తను ఈ సినిమా ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి చెప్పిన దానికి దర్శకుడు సత్యం అర్థం చేసుకొని ఈ సినిమాలో వంగవీటి మోహనరంగా క్యారెక్టర్ కు వేరే హీరోను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారు. బాను చందర్ ను వంగవీటి మోహన రంగ క్యారెక్టర్ కు, శరత్ బాబును రంగా సోదరుడు రాధా క్యారెక్టర్ కు ఎంపిక చేసి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. చైతన్య రథం పేరుతో రూపొందించిన ఈ చిత్రంలో ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ చిత్రం 1987 చిత్రం రిలీజ్ కాగా, ఆ తరువాత 1988లో వంగవీటి మోహన రంగా బెజవాడలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన హత్య ఘటనతో తెలుగు రాష్ట్రాలన్నీ అట్టుడికిపోయాయి. వంద రోజుల పాటు బెజవాడలో కర్ఫ్యూ విధించారు. వంగవీటి రంగా భార్య రత్నకుమారి నిర్మాత గా రూపొందించిన ఈ సినిమా చిత్రం రాధా మిత్ర మండలి మూవీస్ బ్యానర్ పై 1987 లో విడుదల అయ్యింది. రామ రాజ్యమా పేరుతో తీసిన సాంగ్ సినిమాలో కీలకంగా మారిందని అప్పట్లో టాక్.జె.వి. రాఘవులు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. జాలాది రాజారావు, మైలవరపు గోపి, ఇంద్రగంంటి శ్రీకాంత్ శర్మ సాహిత్యాన్ని అందించారు.